Suvendu Adhikari: దీదీ కోటలో దాదా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

Updated on: May 09, 2026 | 11:53 AM

మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల కోటను, 15 ఏళ్ల తృణమూల్ హవాను బద్దలుకొడుతూ.. కోల్‌కతా పీఠంపై మొదటిసారి కాషాయ జెండా రెపరెపలాడింది. ఒకప్పుడు నందిగ్రామ్ ఉద్యమంతో రైతుల గొంతుకగా మారిన సువేందు అధికారి, నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాల సమక్షంలో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు.

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆపై దశాబ్దన్నర కాలం సాగిన తృణమూల్ హవాకు చెక్ పెడుతూ.. బెంగాల్ గడ్డపై మొదటిసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. శనివారం కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని హేమాహేమీలందరూ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజే ఈ ప్రమాణ స్వీకారం జరగడం విశేషం.

అఖండ విజయం.. చారిత్రాత్మక మార్పు

మొత్తం 294 స్థానాలకు గాను 207 స్థానాల్లో అఖండ విజయం సాధించి బీజేపీ చరిత్ర సృష్టించింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని 80 స్థానాలకే పరిమితం చేసి, బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయడంలో సువేందు అధికారి పోషించిన వ్యూహాత్మక పాత్ర సామాన్యమైనది కాదు. మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత నమ్మినబంటుగా, రవాణా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సువేందు, పార్టీలో అంతర్గత విభేదాల వల్ల 2020లో బీజేపీలో చేరారు. అప్పటి నుండి బెంగాల్‌లో గ్రామస్థాయిలో బలమైన కేడర్‌ను నిర్మిస్తూ బీజేపీకి వెన్నెముకగా నిలిచారు.

Published on: May 09, 2026 11:49 AM
Follow Us