మాట నిలబెట్టుకున్న సర్పంచ్.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు
ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామంలో కోతుల సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొత్త సర్పంచ్ ఉపేందర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే కోతుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన, ప్రత్యేక బృందాలతో కోతులను బంధించి అటవీశాఖకు అప్పగించారు. ఎన్నికల హామీని అమలు చేసిన సర్పంచ్‌పై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతూ ప్రజలకు అభ్యర్ధులు అనేక హామీలు ఇస్తుంటారు. అలా గ్రామస్తులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని స్థానికులచే ప్రసంశలు అందుకుంటున్నారు ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామ కొత్త సర్పంచ్ ఉపేందర్. గత కొంతకాలంగా ముదిగొండ గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా, ఏ పొలంలో చూసినా కోతుల దండుతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. పంటలను నాశనం చేయడం, ఆఫీసుల్లో ఫైళ్లు చింపేయడంతో విసిగిపోయిన గ్రామస్తులు పలుమార్లు నిరసనలు తెలిపినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సీపీఎం పార్టీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసిన ఉపేందర్.. “నన్ను గెలిపిస్తే గ్రామంలో కోతులు లేకుండా చేస్తా” అని హామీ ఇచ్చారు. ఆ మాటను నమ్మిన గ్రామస్తులు ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించారు. గెలిచిన కొద్ది రోజులకే సర్పంచ్ ఉపేందర్ తన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామస్తుల సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఊరిలోని కోతులను బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసే నాయకుల మధ్య, గెలిచాక మొదటి పనిగానే కోతుల సమస్యను తీర్చిన సర్పంచ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రజలు నమ్మి గెలిపించినందుకు వారి సమస్యలు తీర్చడమే తన తొలి బాధ్యత అని సర్పంచ్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..
Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?
