హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు.. విద్యార్థినులను కరిచిన ఎలుకలు..
తెలంగాణలోని కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టళ్లు అపరిశుభ్రత, విష పురుగులతో అస్తవ్యస్తంగా మారాయి. నాగుపాములు, తేళ్లు గదుల్లోకి వస్తున్నాయని, ఎలుకలు విద్యార్థినులను కరుస్తున్నాయని ఆరోపణలున్నాయి. కనీస పారిశుద్ధ్యం లేకపోవడంతో విద్యార్థులు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
కాకతీయ విశ్వవిద్యాలయం హాస్టళ్లలో అపరిశుభ్రత, విషపురుగుల బెడద విద్యార్థులను కలవరపెడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత తెలంగాణలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కేయూలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఫార్మసీ హాస్టల్లో నాగుపాము ప్రత్యక్షం కాగా, పదిహేను రోజుల క్రితం బాలికల హాస్టల్ డీ బ్లాక్‌లో బాత్రూమ్ డోర్‌పై పాము కనిపించింది.హాస్టల్ పరిసరాల్లో పేరుకుపోయిన పొదలు, చెత్తాచెదారం కారణంగా పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం, కాకతీయ యూనివర్సిటీ బాలికల హాస్టల్లో ఏకంగా 14 మంది పీజీ విద్యార్థినులను ఎలుకలు కరిచి గాయపరిచాయి. నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు దాడి చేయడంతో విద్యార్థినులను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆహార వ్యర్థాలు, పారిశుద్ధ్య లోపం ఎలుకల సంఖ్యను పెంచుతున్నాయని తెలుస్తోంది. యాజమాన్యం కేవలం సూచనలు జారీ చేయకుండా, వెంటనే పేస్ట్ కంట్రోల్ చేయించాలని, ఆవరణను శుభ్రపరచాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :