Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌.. చిన్న వయసులోనే బీపీ ముప్పు

Updated on: May 28, 2026 | 1:30 PM

హైదరాబాద్ యువతలో జంక్ ఫుడ్స్ కారణంగా రక్తపోటు సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం వెల్లడించింది. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే విద్యార్థుల్లో బీపీ వచ్చే ప్రమాదం మూడు రెట్లు అధికమని శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులోనే అనారోగ్యకర ఆహార అలవాట్లు భవిష్యత్తులో గుండెజబ్బులకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్యాకేజ్డ్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హైదరాబాద్ నగరంలోని యువతలో రక్తపోటు సమస్యలు వేగంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ ‘ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్’ శాస్త్రవేత్తలు ఈ సంచలన పరిశోధనకు నేతృత్వం వహించారు. ఉప్పు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే విద్యార్థుల్లో ఇతరుల కంటే బీపీ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధకులు నగరంలోని వివిధ కాలేజీలకు చెందిన 18 నుండి 24 ఏళ్ల లోపు వయసున్న 311 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఆహార అలవాట్లు, వారి రక్తపోటును పరిశీలించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 12.5 శాతం మంది యువత అప్పుడే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. యువత ఎక్కువగా ఇష్టపడే బిస్కెట్లు, చాక్లెట్లు, ప్యాక్ చేసిన చిప్స్, బ్రెడ్ ఉత్పత్తులు, కూల్‌డ్రింక్స్, ఇన్‌స్టంట్ ఫుడ్స్ వంటి 24 రకాల ఆహార పదార్థాలపై ఈ పరిశోధన సాగింది. కేవలం రుచి, తక్కువ ధరకే లభించడం వల్లే యువత వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఈ పరిశోధన వివరాలు ‘న్యూట్రియెంట్స్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇంత చిన్న వయసులోనే బీపీ రావడం భవిష్యత్తులో గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో తీసుకునే ఆహార నిర్ణయాలే భవిష్యత్తులో వారి గుండె ఆరోగ్యాన్ని శాసిస్తాయని, కాలేజీల్లో మంచి ఆహార అలవాట్లను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేనే నీ భార్యను అన్న AI.. తర్వాత జరిగిందంతా భయంకరం

టెక్నాలజీలో అమెరికాను దాటేసిన ఆసియా దేశం

సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

ఏఐ హెడ్‌గేర్‌తో గంటకు రూ.350 కూరగాయలు అమ్మే కుర్రాడి అదనపు సంపాదన

‘స్టార్ హీరో అనే అపోహే లేవకుండా కిందపడేసింది!

Follow Us