చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్‌

Updated on: Oct 27, 2026 | 4:14 PM

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో నీటి పొదుపుపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. సింగూరు, మంజీర, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో నీటిమట్టాలు తగ్గుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని వృథా చేస్తే జరిమానాలు విధించడంతో పాటు, మాదాపూర్‌ సున్నం చెరువు పరిసరాల్లో 21 అక్రమ బోర్లను ధ్వంసం చేశారు. కలుషిత భూగర్భ జలాలను ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు చర్యలు చేపట్టారు.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి కష్టాలు తప్పవు. నీటి సమస్యను ఎదుర్కోవాలంటే పొదుపే ప్రధాన మార్గమంటోంది వాటర్ సప్లై బోర్డ్. ప్రతి బొట్టునూ జాగ్రత్తగా వాడాలి. నీటిని వృథా చేశారో.. గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి ఉండదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన రిజర్వాయర్లయిన సింగూరు, మంజీర, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లో నీటి మట్టాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లిపోయాయి. ప్రతి బొట్టునూ జాగ్రత్తగా వాడుకోకపోతే గొంతు తడుపుకునేందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. సిటీలోని ప్రతి గల్లీలో సౌండ్ బాక్సులతో చాటింపు వేయిస్తూ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. బైకులు, కార్లు కడుగుతూ, ఇళ్ల ముందు నీటిని వృథా చేస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. ముఖ్యంగా నవంబర్ 1 నుంచి ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి వృథా మరియు అక్రమాలపై నిఘా పెంచారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ట్యాంకర్ రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. లీకేజీలు ఉన్న ట్యాంకర్లలో నీటి నింపడాన్ని నిలిపివేయడంతో పాటు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు, అక్రమంగా భూగర్భ జలాలను తోడేస్తున్న మాఫియాపై హైడ్రా, జలమండలి, విద్యుత్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ముప్పేట దాడి చేశాయి. మాదాపూర్ సున్నం చెరువు సమీకృత ప్రాంతంలో శనివారం ఏకంగా 21 అక్రమ బోరుబావులను ధ్వంసం చేశాయి. బెడ్‌రూమ్‌లు, మంచాల కింద, వంట గదులు, మెట్ల కింద ఇలా ఇళ్లల్లో ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి, భూగర్భ పైపులైన్ల ద్వారా నీటిని ఫిల్లింగ్ కేంద్రాలకు తరలిస్తున్న వైనాన్ని అధికారులు గుర్తించి విస్మయానికి గురయ్యారు. సున్నం చెరువు చుట్టుపక్కల నీటిలో ప్రమాదకర లోహాలు ఉన్నాయని హైడ్రా స్పష్టం చేసింది. ఈ కలుషిత నీటిని తోడి.. అయ్యప్ప సొసైటీ, బోరబండ, హైటెక్‌సిటీలోని హాస్టళ్లు, హోటళ్లకు 10 వేల లీటర్ల ట్యాంకర్‌ను ఏకంగా రూ.10 వేలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే క్రిమినల్ కేసులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. విలాసవంతమైన కార్లలో షో.. చివరికి

మరో 10 ఏళ్లలో మానవాళిని.. AI అంతం చేస్తుందా?

భక్తులారా జర జాగ్రత్త! వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి.. తిరుమల వెళ్తే ఊహించని షాక్!

సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ హోమ్.. షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి!

కార్లలో ఇక ఆటోమేటిక్ బ్రేకులు! 2032 నుంచి కొత్త రూల్‌? డ్రైవర్ బ్రేక్ వేయకున్నా..కారే ఆగుతుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us