Chedi Gang: హైదరాబాద్‌పై మళ్లీ చెడ్డీ గ్యాంగ్ పంజా

Updated on: Sep 29, 2026 | 9:16 PM

హైదరాబాద్‌ మణికొండ, నెక్నాంపూర్‌ పరిధిలోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో తెల్లవారుజామున దొంగతనం కలకలం రేపింది. సుమారు ఆరుగురు ముసుగు ధరించిన వ్యక్తులు లేక్‌సైడ్‌ ఫెన్సింగ్‌ను కత్తిరించి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ఫ్లాట్‌లోకి చొరబడి నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లినట్లు సమాచారం. వారిని ఓ మహిళ గమనించి ప్రశ్నించగా దుండగులు దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తం కావడంతో నిందితులు పరారయ్యారు.

అర్ధరాత్రి వేళ.. ముఖానికి నల్లటి ముసుగులు.. చేతుల్లో ఇనుప రాడ్లు, పారలు, పదునైన కట్టర్లు.. ఒంటిపై కేవలం చెడ్డీ, బనియన్ మాత్రమే! చూడటానికి భయంకరంగా ఉంటూ, దొంగతనానికి అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని వికృత ముఠా.. అదే చెడ్డీ గ్యాంగ్! హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని స్థానికులను మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ ఈ ప్రమాదకర అంతర్రాష్ట్ర ముఠా మళ్లీ పంజా విసిరింది. హైదరాబాద్‌లోని మణికొండ, నెక్నాంపూర్ పరిధిలో ఉన్న ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్ లో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. సుమారు ఆరుగురు సభ్యులు కలిగిన దుండగుల ముఠా అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న లేక్‌సైడ్ ఐరన్ ఫెన్సింగ్‌ను కట్టర్లతో కత్తిరించి లోపలికి ప్రవేశించింది. మెయిన్ గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ కంటపడకుండా, వెనుక మార్గం ద్వారా వచ్చిన ఈ ముఠా నేరుగా సీ-బ్లాక్ మెట్ల మార్గం గుండా ఒక ఫ్లాట్‌లోకి చొరబడి నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్లింది. అయితే, అర్ధరాత్రి వేళ అపార్ట్‌మెంట్ ఆవరణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురు ముసుగు మనుషులను గమనించి ఒక మహిళ ధైర్యంగా వారిని ప్రశ్నించింది. కానీ, ఆ దుండగులు భయపడకుండా తమ వద్ద ఉన్న మారణాయుధాలను చూపిస్తూ ఆమెపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో, చుట్టుపక్కల నివాసితులు మేల్కోవడంతో ఆ ముఠా క్షణాల్లో అక్కడ నుంచి పరారైంది. బాధితుల సమాచారంతో నార్సింగి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అరకొర దుస్తులతో, మారణాయుధాలు పట్టుకుని తిరుగుతున్న చెడ్డీ గ్యాంగ్ దొంగల కదలికలు అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. క్లూస్ టీమ్స్, ప్రత్యేక పోలీస్ బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ శివార్లను టార్గెట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు దీనిని అనుమానిస్తున్నారు. మణికొండ, నెక్నాంపూర్, అల్కాపూర్ టౌన్‌షిప్ ప్రాంతాల్లో వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో ఐటీ ఉద్యోగులు, నివాసితులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెడ్డీ గ్యాంగ్ అనేది కేవలం ఒక్క ముఠా కాదు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన కొన్ని గిరిజన లేదా పారధి తెగలకు చెందిన క్రిమినల్ ముఠాలను పోలీసులు సాధారణంగా చెడ్డీ గ్యాంగ్ అని పిలుస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లోని దహోద్, మధ్యప్రదేశ్‌లోని ఝాబువా, ధార్ జిల్లాల నుంచి ఈ దొంగలు ఇతర రాష్ట్రాలకు వస్తుంటారు. వీరు తమ ప్రాంతాలను దాటి తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలలోని నగర శివార్లను టార్గెట్ చేస్తారు. చోరీకి పాల్పడే సమయంలో వీరు కేవలం నిక్కరు, బనియన్ మాత్రమే ధరిస్తారు. శరీరంపై ఎవరైనా పట్టుకుంటే జారిపోవడానికి ఒంటి నిండా నూనె లేదా గ్రీజు పూసుకుంటారు. ముఖాలకు మాస్కులు కట్టుకుంటారు. నగరానికి రాగానే వీరు హోటళ్లలో ఉండరు. రైల్వే ట్రాక్‌ల పక్కన, నిర్మానుష్యమైన పొదల్లో, బస్టాండ్లలో సామాన్య ప్రయాణికుల్లా లేదా కూలీల్లా ఉండిపోతారు. పగటిపూట బుడబుక్కలవాళ్లుగా, కవాడీలుగా, భిక్షాటకులుగా లేదా పాత సామాన్లు కొనేవారిలా వచ్చి ఒంటరి ఇళ్లు, తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేస్తారు. రాత్రి 1 గంట నుండి 4 గంటల మధ్య డోర్లు బద్దలు కొట్టడానికి పారలు, ఇనుప రాడ్లు ఉపయోగిస్తారు. దొంగతనం చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డుకుంటే దయాదాక్షిణ్యాలు లేకుండా రాళ్లతో, రాడ్లతో తలపై దాడి చేసి చంపడానికి కూడా వెనుకాడరు. చోరీ పూర్తి కాగానే నగదు, బంగారంతో వెంటనే రైళ్లు లేదా బస్సుల్లో తమ సొంత రాష్ట్రాలకు పారిపోయి, అక్కడ సొత్తు పంచుకుంటారు. కాబట్టి. వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది. ఈ క్రమంలోనే నార్సింగి పోలీసులు, నగర కమిషనరేట్ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి వేళల్లో అపార్ట్‌మెంట్ మెయిన్ గేట్లతో పాటు వెనుక డోర్లు, ఫెన్సింగ్ మార్గాలను సరిచూసుకోవాలని చెప్పారు. అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే నేరుగా వారి దగ్గరకు వెళ్లకుండా 100 కి డయల్ చేసి పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. సిసిటివి కెమెరాలు, నైట్ విజన్ లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో హౌసింగ్ సొసైటీలు ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూసుకొస్తున్న మరో వాయుగుండం దడ పుట్టిస్తున్న ఉపరితల ఆవర్తనం.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఏఐకి కూడా నొప్పా..! నొప్పి భరించలేక యూజర్లపై ఏఐ దాడి.. అధ్యయనంలో సంచలన విషయాలు!

హెయిర్‌కట్ తర్వాత ఆ మసాజ్ చేయిస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

Loading...
Unable to load recommendations.
Follow Us