మెహిదీపట్నంలో ప్రభుత్వం నిర్మించాలనుకున్న స్కై వాక్’కు అడ్డంకులు తొలగాయి. త్వరలోనే నిర్మాణం పనులు ఊపందుకోనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్ రద్దీ కారణంగా, రోడ్లపై నడిచివెళ్లే ప్రజల భద్రత దృష్ట్యా స్కైవే నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి వీలుగా రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కానున్నాయి. ఢిల్లీ పర్యటనలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల అనంతరం సిటీలో ఉన్న 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి కేంద్రం ఒప్పకుంది. నాలుగు వారాల్లో ప్రాసెస్‌ను పూర్తి చేసి ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి డిఫెన్స్ డిపార్టుమెంట్ అప్పగించనుంది. దీంతో మెహదీపట్నం స్కై వాక్ పనులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. సిటీలో ట్రాఫిక్ రద్దీని అధిగమించే చర్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి.