ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. విలాసవంతమైన కార్లలో షో.. చివరికి

Updated on: Oct 27, 2026 | 4:12 PM

ఢిల్లీలో 23 ఏళ్ల విక్రాంత్‌ తోమర్‌ దాదాపు 20 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లను మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, సంపన్న వ్యాపారవేత్తగా నమ్మించిన నిందితుడికి ఓ కానిస్టేబుల్‌ సుమారు రూ.24 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అద్దెకు తీసుకున్న లగ్జరీ కార్లతో నమ్మకం కలిగించాడనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలు, ఇతర బాధితుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమవుతాడు. తాను బాగా డబ్బున్న బిజినెస్‌మెన్ అని పరిచయం చేసుకుంటాడు. లగ్జరీ కార్లలో తిరుగుతూ, తన దగ్గర చాలా డబ్బు ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. మాటలతో నమ్మకం కలిగిస్తాడు. ఆ తర్వాత అవసరం ఉందంటూ డబ్బులు అడుగుతాడు. ఇదంతా ఒక సినిమా కథలా అనిపిస్తోందా? కానీ ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. ఒకరిద్దరు కాదు.. దాదాపు 20 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకున్నాడనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న 23 ఏళ్ల విక్రాంత్ తోమర్‌ను ఢిల్లీలోని బురారీలో పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసు సిబ్బందిని మోసం చేసి లక్షల రూపాయలు తీసుకున్నాడనేది అతనిపై ఉన్న ప్రధాన ఆరోపణ. అసలు ఈ పరిచయాలు ఎలా మొదలయ్యాయి? ఒక మహిళా కానిస్టేబుల్ ఏకంగా రూ.24 లక్షల వరకు ఎలా నష్టపోయింది? లగ్జరీ కార్ల వెనుక ఉన్న అసలు కథేంటి? ఈ వ్యవహారంలో మరింతమంది బాధితులు ఉన్నారా? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బాధితురాలి విషయానికి వద్దాం. శివానీ అనే మహిళా కానిస్టేబుల్‌కు విక్రాంత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ వాట్సాప్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా సోషల్ మీడియాలో మొదలైన పరిచయం క్రమంగా నమ్మకంగా మారినట్లు తెలుస్తోంది. విక్రాంత్ తనను తాను రిచ్ బిజినెస్‌మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తన దగ్గర డబ్బుకు కొదవ లేదన్నట్టుగా వ్యవహరిస్తూ, పోష్ లైఫ్ స్టైల్ చూపించేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడే ఒక విషయం గమనించాలి. ఖరీదైన కార్లలో తిరగడం, బ్రాండెడ్ వస్తువులు వాడటం, సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్ చూపించడం.. ఇవేవీ ఒక వ్యక్తి ఆర్థిక స్థితికి లేదా నిజాయితీకి గ్యారంటీ కాదు. కానీ బయట కనిపించే ఈ హంగులు చూసి ఎదుటివారికి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. ఈ కేసులో కూడా అలాంటి పద్ధతిని నిందితుడు ఉపయోగించాడు. ఇక డబ్బుల విషయానికొస్తే.. శివానీ సుమారు రూ.24 లక్షలు నష్టపోయినట్లు సమాచారం. ఇందులో ఆమె వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బుతో పాటు, రూ.12 లక్షల పర్సనల్ కూడా ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, ఇతరుల దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బు కూడా అతనికి ఇచ్చినట్లు ఆమె వాపోయారు. ఈ కేసులో మరో కీలకమైన అంశం ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించినది. సుమారు రూ.8 లక్షలు 1x.com బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌తో సంబంధం ఉన్న అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయినట్లు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. ఈ లావాదేవీల వెనుక ఎవరున్నారు? డబ్బు ఎక్కడికి వెళ్లింది? దాన్ని ఎవరు ఉపయోగించారు? అనే విషయాలపై పోలీసులు ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, శివానీ ఇచ్చిన ఫిర్యాదులో అనుచితంగా తాకినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని సమాచారం. దీంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విక్రాంత్ ఉపయోగించినట్లు చెబుతున్న మరో పద్ధతి లగ్జరీ కార్లు. అతను ఖరీదైన కార్లను కొనుగోలు చేయకుండా, కేవలం ఎనిమిది గంటల చొప్పున అద్దెకు తీసుకునేవాడని దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ కార్లలో తిరుగుతూ తనకు భారీగా ఆస్తులు, డబ్బు ఉన్నాయనే అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నించేవాడని అనుమానిస్తున్నారు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒక వ్యక్తి దగ్గర ఖరీదైన కారు కనిపించిందని, అతను సంపన్నుడని వెంటనే నమ్మలేం. ఆ కారు అతనిదేనా? అద్దెకు తీసుకున్నదా? అతను చెప్పే వ్యాపారం నిజంగా ఉందా? ఇలాంటి విషయాలను తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం అతని వ్యక్తిగత పరిచయాలకు సంబంధించినది. విక్రాంత్‌తో సహజీవనం చేస్తున్న మహిళ ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె బ్యాచ్‌మేట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించి ఇతర మహిళా కానిస్టేబుళ్లను గుర్తించాడా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక బాధితుల సంఖ్య విషయానికొస్తే.. దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్లు ఈ తరహా మోసానికి గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొందరు బాధితులు అధికారుల వద్దకు విషయం చెప్పారని.. ఇంకొందరు పరువు పోతుందని గమ్మున ఉన్నారని తెలుస్తోంది. విక్రాంత్‌పై ఢిల్లీలో ఇప్పటికే మోసానికి సంబంధించి ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల్లో ఒకదానికి సంబంధించి అతను జూన్‌లో బెయిల్‌పై విడుదలైనట్లు కూడా అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీస్ విభాగం.. ఆర్థిక లావాదేవీలు, ఇతర అనుమానితులు, ఇంకా బాధితులు ఉన్నారా అనే అంశాలపై దృష్టి పెట్టింది. డబ్బులు ఏయే బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ అయ్యాయి? ఆ ఖాతాల వెనుక ఎవరున్నారు? ఈ వ్యవహారంలో ఇంకెవరైనా సహకరించారా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఘటన నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి ఎంత బాగా మాట్లాడినా, ఎంత లగ్జరీ లైఫ్ చూపించినా, అతన్ని పూర్తిగా తెలుసుకున్నట్టే కాదు. ముఖ్యంగా డబ్బుల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. వ్యక్తిగత రుణం తీసుకుని మరీ ఎవరికైనా డబ్బు పంపించే ముందు ఆ వ్యక్తి చెప్పే వివరాలను కంప్లీట్‌గా చెక్ చేసుకోవాలి. కాస్ట్లీ దుస్తులు వేసుకుని, ఖరీదైన కార్లతో తిరుగుతూ, పబ్బుల్లో తిరుగుతున్నాడని కమిట్ అయి.. బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి డబ్బులు అడిగితే, ఎందుకు అడుగుతున్నాడు? డబ్బు ఎక్కడికి వెళ్తోంది? తిరిగి చెల్లించడానికి ఆధారాలేమిటి? అనే ప్రశ్నలు అడగడం చాలా ముఖ్యం. అనుమానం వచ్చినప్పుడు లావాదేవీలు ఆపి, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రస్తుతం విక్రాంత్ తోమర్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల సంఖ్య, డబ్బుల లావాదేవీలు, ఇతర వ్యక్తుల పాత్ర వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా దేశ రాజధానిలో ఇంతమంది లేడీ కానిస్టేబుల్స్‌ను చీట్ చేసిన ఈ కేటుగాడి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో 10 ఏళ్లలో మానవాళిని.. AI అంతం చేస్తుందా?

భక్తులారా జర జాగ్రత్త! వాట్సాప్‌లో టికెట్లు బుక్ చేసి.. తిరుమల వెళ్తే ఊహించని షాక్!

సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ హోమ్.. షారుఖ్ ఖాన్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి!

కార్లలో ఇక ఆటోమేటిక్ బ్రేకులు! 2032 నుంచి కొత్త రూల్‌? డ్రైవర్ బ్రేక్ వేయకున్నా..కారే ఆగుతుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us