యువతలో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్సర్.. అప్రమత్తంగా ఉండకపోతే ముప్పే
ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించిన పెద్దపేగు క్యాన్సర్ ఇప్పుడు యువతలోనూ వేగంగా పెరుగుతోంది. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, 45 ఏళ్లు దాటిన తర్వాత కొలొనోస్కోపీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సమాజంలో క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు వృద్ధులు లేదా పెద్ద వయసు వారిలోనే కనిపించే ఈ ‘పెద్దపేగు క్యాన్సర్’ ఇప్పుడు యువతలోనూ ఆందోళనకరంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. ఈ వ్యాధి శరీరంలో చేరిన దాదాపు పదేళ్ల వరకు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నిశ్శబ్దంగా అభివృద్ధి చెందుతుంది. మల విసర్జనలో మార్పులు, రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలు బయటపడే సమయానికి వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. రోజువారీ జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ నిపుణుల సలహా మేరకు కొలొనోస్కోపీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్‌కు దారితీసే చిన్న చిన్న గడ్డలను ప్రారంభ దశలోనే గుర్తించి, తొలగించే అవకాశం ఉంటుంది. రోజువారీ ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తప్పుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని కేవలం 10 గ్రాములు పెంచినా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆకుకూరలు, తాజా పండ్లు, గింజలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ మీట్ , రెడ్ మీట్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాసెస్డ్ మీట్‌ను క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాదకర పదార్థంగా గుర్తించింది. అలాగే, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం శ్రేయస్కరం. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, శరీరంలోని వ్యర్థాలు పెద్దపేగులో ఎక్కువసేపు నిల్వ ఉండకుండా త్వరగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా హానికరమైన టాక్సిన్స్ పెద్దపేగు గోడలకు హాని చేసే అవకాశం తగ్గుతుంది. పెద్దపేగు క్యాన్సర్‌ను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినప్పటికీ.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ మహమ్మారి ముప్పు నుండి సురక్షితంగా బయటపడవచ్చంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాధారణ మోడల్.. ‘కొకైన్ క్వీన్’ ఎలా అయింది?
చందమామపై మనిషి కాపురం! ఎప్పటి నుంచో తెలుసా?
Allu Arjun: అల్లు అర్జున్ పై ప్రశంసలు.. చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం
Satyadev: ‘నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు’
లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా? ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణలతో సినిమాలు చేశాడా?
