బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

Updated on: Apr 15, 2026 | 6:13 PM

కేంద్రం కొరత లేదంటున్నా, LPG సిలిండర్ల సరఫరాలో జాప్యం, "గోస్ట్ డెలివరీలు" వినియోగదారులను ఆందోళన పరుస్తున్నాయి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించబడుతున్నాయి. DAC కోడ్ దుర్వినియోగం అవుతోంది. మోసాలను నివారించడానికి, మీరు జాగ్రత్తగా ఉండాలి, అధికారిక ఛానెల్‌ల ద్వారా బుక్ చేయాలి, ఫిర్యాదు చేయడానికి ఆధారాలను భద్రపరచుకోవాలి. మీ హక్కులను తెలుసుకోండి, మోసపోయినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయండి.

దేశంలో LPG సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. కస్టమర్లు ఎలాంటి ఆందోళన పడొద్దని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం విరుద్ధంగానే ఉందా? ఎల్పీజీ సిలిండర్‌ ల సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్‌ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్‌ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్‌ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్‌ డెలివరీ అయినట్లు మెసేజ్‌ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్‌ను కస్టమర్లకు అడ్జస్ట్‌ చేసి ఇస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్‌ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్‌ మార్కెట్‌లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ లేదంటే యాప్‌ల ద్వారా బుకింగ్‌ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. సిలిండర్‌ డెలివరీకి డీఏసీ కోడ్‌ అనేది తప్పనిసరి. ఆ కోడ్‌ చెబితేనే డెలివరీ బాయ్‌ సిలిండర్‌ ఇస్తాడు. కానీ, ఘోస్ట్‌ డెలివరీ దందా ఆ కోడ్‌తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్‌ రావడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్‌ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్‌ మార్కెట్‌కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్‌ కేర్‌కి ఫిర్యాదు చేయండి. బుకింగ్‌ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్‌షాట్‌లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి. సిలిండర్‌ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్‌ బుకింగ్‌ చేస్కోవద్దు. డీఏసీ కోడ్‌ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్‌ ఏజెన్సీలకు, గోడౌన్‌లకు పరుగులు తీయొద్దు. ఆన్‌లైన్‌ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్‌/యాప్‌ల ద్వారా మాత్రమే బుకింగ్‌ చేసుకోవాలి. చెప్పిన టైంలో సిలిండర్‌ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్‌ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్‌ కస్టమర్‌ కేర్ నంబర్లను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. consumerhelpline.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్‌ బుక్‌ కన్జూమర్‌ నెంబర్‌, ఎల్పీజీ ఐడీ నెంబర్‌, అలాగే గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసిన ID.. పేమెంట్‌ రసీదు, మెసేజ్‌ స్క్రీన్‌షాట్‌ వంటివి సాక్ష్యాలుగా అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vande Bharat Sleeper: దక్షిణాదికి తొలి వందే భారత్ స్లీపర్.. ఆ మార్గంలోనే ప్రయాణం

ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం

గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు

ఈ ఏడాది వర్షాలు తక్కువేనట.. వ్యవసాయంపై ఆందోళన

పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

Follow Us