అమలాపురంలో అరుదైన వేలం.. అమ్మవారి మెడలో దండ వేయాలంటే..

Updated on: Oct 20, 2026 | 4:09 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా సందర్భంగా నిర్వహించిన పూలదండ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవణం వీధిలోని శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో తొలి పూలమాల వేసే అవకాశం కోసం నిర్వహించిన వేలంలో రూ.1.53 లక్షల ధర పలికింది. హైదరాబాద్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త ఆకుల లక్ష్మణరావు వరుసగా మూడోసారి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. అమ్మవారిపై భక్తితో ప్రత్యేక టేకు మందిరాన్ని కూడా ఆయన సమర్పించారు.

సాధారణంగా వినాయక చవితికి లడ్డూ వేలం పాటలు, ఆలయాల్లో చీరలు లేదా వస్తువుల వేలం పాటలు చూస్తుంటాం. కానీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా వేళ వినూత్న వేలం నిర్వహించారు. అమలాపురం రవణం వీధిలోని శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో వేసే మొదటి పూలదండ కోసం నిర్వహించిన వేలంపాట నిర్వహించారు. ఇక్కడ 79వ విజయదశమి వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా అమ్మవారి పూలదండకు వేలంపాట నిర్వహిస్తారు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం కేవలం రూ. 3,500 తో ప్రారంభమైన ఈ పూలదండ వేలంపాట క్రమంగా పెరిగి, ఈ ఏడాది ఏకంగా రూ. 1,53,000 లకు చేరింది. హైదరాబాద్‌లో స్థిరపడిన అమలాపురానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల లక్ష్మణరావు ఈ వేలంపాటలో అత్యధిక ధర చెల్లించి మొదటి పూలదండ వేసే భాగ్యాన్ని దక్కించుకున్నారు. గతంలో ఆన్‌లైన్ ద్వారా వేలంలో పాల్గొన్న ఆయన, ఈసారైతే నేరుగా అమలాపురం వచ్చి మరీ వేలంలో గెలుపొందారు. లక్ష్మణరావు వరుసగా మూడోసారి ఈ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. కేవలం పూలదండ మాత్రమే కాకుండా, అమ్మవారి విగ్రహం కోసం లక్షల రూపాయలతో ప్రత్యేకంగా టేకు మందిరాన్ని కూడా ఆయన సమర్పించారు. అమ్మవారి ఆశీస్సుల వల్లే తాను వ్యాపారంలో, తన పిల్లలు విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారని లక్ష్మణరావు ఆనందం వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి దండ దక్కించుకున్న ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా గజమాలతో సత్కరించారు. విజయదశమి రోజున అమ్మవారికి తొలి మాల వేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న విద్యుత్‌ డిమాండ్‌

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆహార నిల్వల్లో దూసుకెళ్తున్న చైనా.. మరి భారత్‌ పరిస్థితేంటి?

అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..

సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు

గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

Loading...
Unable to load recommendations.
Follow Us