
Most Expensive ICE Cream: వేసవి కాలంలో చల్ల చల్లని ఐస్‌క్రీమ్ తింటుంటే ఆ మజానే వేరు. చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఐస్‌క్రీమ్ పేరు చెబితేనే నోరూరుతుంది. సాధారణంగా ఐస్‌క్రీమ్ కప్పు ధర యాభై రూపాలో, వందో లేక మహా అయితే వెయ్యి రూపాలో ఉంటుంది. కానీ, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక ఐస్‌క్రీమ్ స్కూప్ ధర అక్షరాలా రూ. 5.5 లక్షలు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.
జపాన్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఈ అరుదైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసింది. దీనికి ‘బ్యాకుయా’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. సామాన్యుడు తన జీవితకాలంలో సంపాదించే మొత్తాన్ని ఈ ఐస్‌క్రీమ్ ఒకే ఒక్క స్కూప్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుందంటే దీని క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఐస్‌క్రీమ్‌లో అంతలా ఏముంది? ఎందుకు దీనికి అంత ధర? అనే కదా మీ సందేహం!
ఈ ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగించే పదార్థాలు అత్యంత అరుదైనవి, ఖరీదైనవి. కేవలం ఇటలీలో మాత్రమే లభించే ‘వైట్ ట్రఫుల్స్’ అనే ఒక రకమైన అరుదైన పుట్టగొడుగులను ఇందులో ప్రధానంగా వాడతారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ వైట్ ట్రఫుల్స్ ధర కేజీ సుమారు రూ. 12 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు అత్యంత నాణ్యమైన, సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన ప్రత్యేకమైన చీజ్‌ను కూడా ఇందులో మిక్స్ చేస్తారు.
రుచిలోనూ, లుక్‌లోనూ దీనికి సాటిమరొకటి లేదు. ఐస్‌క్రీమ్ తయారీ పూర్తయిన తర్వాత, దానిపై తినగలిగే స్వచ్ఛమైన బంగారు పొరను (ఎడిబుల్ గోల్డ్ లీఫ్) గార్నిషింగ్‌గా అలంకరిస్తారు. అంటే ఈ ఐస్‌క్రీమ్ తినేటప్పుడు మనం పరోక్షంగా బంగారాన్ని ఆస్వాదిస్తున్నామన్నమాట!
ఇంతటి విలాసవంతమైన ఐస్‌క్రీమ్‌ను తినడానికి సాధారణ ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్లు వాడితే ఏం బాగుంటుంది? అందుకే, ఈ ఐస్‌క్రీమ్‌ను కొనుగోలు చేసిన వారికి, దానిని తినడం కోసం ప్రత్యేకంగా చేతితో డిజైన్ చేసిన ఒక వెండి స్పూన్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తుంది.
అంత ధర పెట్టి కొనుగోలు చేసే వినియోగదారుడికి అత్యుత్తమ అనుభూతిని ఇవ్వాలనేది ఆ సంస్థ లక్ష్యం. అందుకే ఈ ఐస్‌క్రీమ్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు, సదరు కంపెనీకి చెందిన ప్రధాన వంటగాళ్లు (చీఫ్ చెఫ్‌లు) ప్రతి బ్యాచ్‌ను స్వయంగా రుచి చూస్తారు. నాణ్యత, రుచి, సువాసన అన్నింట్లోనూ వంద శాతం పర్‌ఫెక్ట్‌గా ఉందని వారు ధృవీకరించిన తర్వాతే దీనిని కస్టమర్లకు విక్రయిస్తారు. ‘పిండి కొద్దీ రొట్టె’ అన్న సామెత చందాన.. అంతటి అరుదైన పదార్థాలు వాడారు కాబట్టే ఆ స్థాయిలో ధర పలికుతోంది.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..