అమెరికా టెక్సాస్‌కు చెందిన యూజిన్ బోస్టిక్ అనే 80 ఏళ్ల వృద్ధుడు తన మానవత్వాన్ని చాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అప్పటి వరకూ తమ ఇళ్లలో ఎంతో ప్రేమగా పెంచుకున్న మూగజీవాలను పోషించలేక కొందరు అర్ధాంతరంగా వదిలేస్తున్నారు. దాంతో అనాధలుగా మిగిలిన ఆ మూగజీవాల పాలిట దేవుడుగా నిలిచాడు ఆ పెద్దాయన. టెక్సాస్‌లో అతనికి ఒక తోట ఉంది. రోజూ అక్కడ యూజిన్ తోటపని చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ చాలామంది తమ కుక్కలను తీసుకొచ్చి ఆ తోట సమీపంలో వదిలేస్తున్నారు. అన్ని రోజులూ టైముకి ఆహారం తింటూ… తమ యజమానుల సమక్షంలో పెరిగిన ఆ కుక్కలు… సడెన్‌గా ఒంటరి అవుతున్నాయి. వాటికి ఆహారం లేకుండా పోతోంది. అది గమనించిన యూజిన్ ఓ నిర్ణయం తీసుకున్నాడు.
అలా అనాధలుగా తన తోట దగ్గర వదిలేసిన కుక్కలన్నిటినీ చేరదీసి, పెంచుతున్నాడు. అంతే కాదు వాటి కోసం టాయ్ ట్రైన్ కూడా తయారుచేశాడు యూజిన్. నీటిని నిల్వచేసుకునే డ్రమ్ములకు మధ్యలో కన్నం పెట్టి, ప్రతీ డ్రమ్ముకూ కింద చక్రాలు పెట్టి… వాటన్నింటినీ ఓ ట్రైన్ లా చేసాడు. దానిని తన ట్రాక్టర్‌కు కట్టి, ఆ కుక్కలన్నిటినీ అందులో ఎక్కించుకొని రోజూ ఊళ్లో తిప్పుతాడు. అలా టాయ్ ట్రైన్‌లో తిరగడం అంటే ఆ కుక్కలకు ఎంతో ఇష్టమట. ఈ పెద్దాయనకు ఆయన సోదరుడు కోర్కీ కూడా సాయం చేస్తుంటాడట. ఇలా యూజిన్ డజన్ల కొద్దీ కుక్కల్ని పెంచుతూ… వాటి బాగోగులు చూసుకుంటూ… వాటిని ట్రాక్టర్ టాయ్ ట్రైన్‌లో తీసుకెళ్తూ… అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. రెడ్జిట్ అనే సోషల్‌మీడియా ఖాతలో పోస్ట్ చేసిన ఈ వీడియోను వేలమంది వీక్షిస్తూ పెద్దాయనను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తూ పెద్దాయన నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నారు.