పిల్లలు లేరా? చిన్నతనంలో భద్రపరిచిన వృషణ కణజాలంతో ఏళ్ల తర్వాత అద్భుతం!

యూకేలోని వైద్యులు అరుదైన వృషణ కణజాల మార్పిడి శస్త్రచికిత్స చేసారు. 19 ఏళ్ల యువకుడికి చిన్నతనంలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో సంతానాన్ని పొందే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో వృషణాల నుంచి కణజాలాన్ని సేకరించి భద్రపరిచారు. చిన్నతనంలో భద్రపరిచిన కణజాలమే ఇప్పుడు కొత్త ఆశను కల్పించింది. వైద్యులు ఆ కణజాలాన్ని ప్రస్తుతం తిరిగి అతడి శరీరంలోకి అమర్చారు.

పిల్లలు లేరా? చిన్నతనంలో భద్రపరిచిన వృషణ కణజాలంతో ఏళ్ల తర్వాత అద్భుతం!
Student Left With No Sperm After Chemotherapy Gets Testicular Tissue Transplant

Updated on: Oct 09, 2026 | 12:19 PM

క్యాన్సర్‌ ఇతర తీవ్ర వ్యాధులకు చికిత్స తీసుకునే చిన్నారులు, యువకుల్లో కొందరు భవిష్యత్తులో సంతానాన్ని పొందే సామర్థ్యాన్ని కోల్పోతుంటారు. కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు వీర్యకణాలను దెబ్బతీస్తాయి.  బ్రిటన్‌లో తొలిసారి 19 ఏళ్ల యువకుడికి వృషణ కణజాల మార్పిడి (Testicular Tissue Transplant) శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ చికిత్సతో అతడిలో మళ్లీ వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభమవుతుందా? ఫలితం కోసం వైద్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఎనిమిది నెలల తర్వాతే తెలుస్తుంది

శస్త్రచికిత్స జరిగిన ఎనిమిది నెలల తర్వాత మార్పిడి చేసిన కణజాలంలో కొంత భాగాన్ని సేకరించి పరీక్షించనున్నారు. ఫలితాల ఆధారంగా వీర్యకణాల ఉత్పత్తి తిరిగి ప్రారంభమైందా లేదా అంచనా వేస్తారు.

వృషణ కణజాల మార్పిడి .

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్సే ప్రధాన ప్రాధాన్యం. ఆ సమయంలో భవిష్యత్తులో పెళ్లి, కుటుంబం, పిల్లలు వంటి విషయాల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అందుకే చికిత్స వల్ల సంతానోత్పత్తిపై పడే ప్రభావాన్ని తల్లిదండ్రులకు వివరించి, సాధ్యమైనప్పుడు కణజాలాన్ని ముందుగానే భద్రపరచడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అప్పటికి ముందుగానే కణజాలాన్ని భద్రపరిచి ఉంటే, అది వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా 3,100 మంది

ఈ వైద్య విధానం విజయవంతమైతే, భవిష్యత్తులో సంతానాన్ని పొందే అవకాశాలు లేని ఎంతోమంది యువకులకు కొత్త మార్గం తెరుచుకుంటుంది. బ్రిటన్‌లో 1,200 మందికి పైగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,100 మంది భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఆశతో తమ వృషణ కణజాలాన్ని  భద్రపరిచారు. వీరిలో చిన్నతనంలో క్యాన్సర్ లేదా ఇతర తీవ్రమైన వ్యాధులకు చికిత్స తీసుకున్నవారూ ఉన్నారు.

అబ్బాయిలకు తక్కువ మార్గాలు

కీమోథెరపీ తీసుకుంటున్న అమ్మాయిల భవిష్యత్తు సంతానోత్పత్తిని కాపాడేందుకు అండాశయ కణజాలాన్ని గడ్డకట్టించి భద్రపరిచే విధానం దాదాపు మూడు దశాబ్దాలుగా అందుబాటులో ఉంది.  అబ్బాయిల విషయంలో ఇలాంటి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. యుక్తవయస్సుకు రాని బాలురలో వీర్యకణాల ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాదు. అందువల్ల వీర్యకణాలను నేరుగా సేకరించి భద్రపరచడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో వృషణ కణజాలాన్ని భద్రపరచడం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం 19 ఏళ్ల యువకుడికి చిన్నతనంలో భద్రపరిచిన కణజాలాన్ని మార్పిడి చేసారు. ఎనిమిది నెలల తర్వాత పరీక్షల ఫలితాలే సానుకూలంగా ఉంటే, తీవ్రమైన వ్యాధులకు చికిత్స పొందుతూ భవిష్యత్తులో తండ్రి కాలేమో అని ఆందోళన చెందే ఎంతోమందిలో  కొత్త ఆశలు చిగురించే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us