AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీధి కుక్కలు బైక్‌ను వెంటాడితే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం పొరపాటున చేయకండి..!

టూవీలర్‌పై ప్రయాణిస్తున్నప్పుడు వీధి కుక్కలు ఉన్నట్టుండి మొరుగుతూ బైక్‌ను వెంటాడటం మనం నిత్యం చూస్తుంటాం. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్యంగా ఉండే వీధుల్లో వెళ్తున్నప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఎదురవుతుంది. ఇలాంటి సమయంలో చాలామంది కంగారుపడి చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కుక్కలు బైక్‌ను తరిమినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో, ఎలా సురక్షితంగా బయటపడాలో ఇక్కడ తెలుసుకుందాం.

వీధి కుక్కలు బైక్‌ను వెంటాడితే ఏం చేయాలి? ఈ తప్పులు మాత్రం పొరపాటున చేయకండి..!
Street Dogs Chasing Bikes
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2026 | 10:25 AM

Share

రోడ్డుపై బైక్‌పై వెళ్తున్నప్పుడు వీధి కుక్కలు ఒక్కసారిగా తరిమిన ఘటనలు మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. వీధి కుక్కలు వెంటపడినప్పుడు బైక్‌ను నెమ్మది చేసి, ప్రశాంతంగా ముందుకు సాగడమే సురక్షితమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బైక్ వేగాన్ని హఠాత్తుగా పెంచకూడదు

కుక్కలు వెంటపడగానే చాలామంది భయంతో వెంటనే బైక్ ఎక్సిలేటర్ తిప్పి వేగాన్ని పెంచుతారు. దీనివల్ల బైక్ అదుపుతప్పి కిందపడిపోవడం లేదా ఎదురుగా వచ్చే ఇతర వాహనాలను ఢీకొట్టడం వంటి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. పైగా, మీరు వేగం పెంచే కొద్దీ మిమ్మల్ని వేటాడే లక్ష్యంగా భావించి కుక్కలు మరింత వేగంగా మీ వెనుక పరిగెత్తుతాయి.

భయంతో కేకలు వేయడం, హారన్ మోగించడం వద్దు

కుక్కలను భయపెట్టడానికి గట్టిగా కేకలు వేయడం లేదా బైక్ హారన్‌ను నిరంతరం మోగించడం చేయకూడదు. ఎందుకంటే విపరీతమైన శబ్దాలు కుక్కలలో మరింత తీవ్రమైన ఆవేశాన్ని, ఆందోళనను రేకెత్తిస్తాయి. దీనివల్ల అవి మరింత దాడికి దిగే ప్రమాదం ఉందే తప్ప వెనక్కి తగ్గుముఖం పట్టవు.

ఇవి కూడా చదవండి

కాళ్లతో తన్నడానికి ప్రయత్నించకండి

బైక్ నడుపుతూ కుక్కలను కాళ్లతో తన్నడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించడం అస్సలు మంచిది కాదు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి వాహనంతో సహా కిందపడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి. కదిలే బైక్‌పై నుండి కిందపడితే తీవ్ర గాయాలపాలవుతారు.

నేరుగా కుక్కల కళ్లలోకి చూడటం

కుక్కలు వెంటపడుతున్నప్పుడు వాటి కళ్లలోకి నేరుగా చూడకూడదు. జంతు శాస్త్రం ప్రకారం, ఒక జంతువు కళ్లలోకి నేరుగా చూడటాన్ని అవి సవాలుగా లేదా దాడికి సంకేతంగా భావిస్తాయి. అందువల్ల మీ చూపును ముందుకు మాత్రమే ఉంచి ప్రశాంతంగా ఉండాలి.

సరైన మార్గం ఏమిటి?

వీధి కుక్కలు వెంటపడినప్పుడు ఆందోళన చెందకుండా బైక్ వేగాన్ని నెమ్మదిగా తగ్గించాలి. వేగం తగ్గగానే సాధారణంగా కుక్కలు కూడా తమ వేగాన్ని తగ్గించి వెనక్కి తగ్గిపోతాయి. ఒకవేళ అవి బాగా దగ్గరకు వస్తే బైక్‌ను సురక్షితమైన ప్రదేశంలో నిలిపివేసి, ప్రశాంతంగా నిలబడితే అవి మొరిగి వెళ్లిపోతాయి. సంయమనం పాటించడమే మీ ప్రాణ రక్షణకు మార్గం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us