
గుజరాత్‌లోని దాహోద్ జిల్లా ధాన్‌పూర్ తాలూకా అగస్‌వాణి గ్రామంలోని ఒక పొలంలో రెండు తలలు ఉన్న అరుదైన వుల్ఫ్ స్నేక్ పిల్ల ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో దాహోద్ ప్రకృతి మిత్ర మండలి రెస్క్యూ టీమ్ ఆ పామును సురక్షితంగా పట్టుకుంది. ఈ పాము పూర్తిగా విషరహితమైనది. గుజరాత్‌లో సజీవంగా రెండు తలల పాము దొరకడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
పరిశోధకుల వివరాల ప్రకారం.. ఇది సాధారణంగా ఇళ్ల చుట్టుపక్కల, పొలాల్లో కనిపించే వుల్ఫ్ స్నేక్ రకానికి చెందిన చిన్న పిల్ల. దీని పొడవు సుమారు 5 నుండి 6 అంగుళాలు మాత్రమే ఉంది. అత్యంత ఉపశమనం కలిగించే విషయమేమిటంటే.. ఈ పాము పూర్తిగా విషరహితమైనది. దీనివల్ల మానవులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇవి సాధారణంగా చిన్న చిన్న పురుగులు, బల్లులను తింటూ పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి.
పాములకు రెండు తలలు రావడం అనేది చాలా అరుదైన ఆనువంశిక వైకల్యం. శాస్త్రీయ పరిభాషలో ఈ పరిస్థితిని బైసెఫలీ అని పిలుస్తారు. తల్లి గర్భంలో లేదా గుడ్డులో పిండం రూపాంతరం చెందే సమయంలో పూర్తిస్థాయిలో విడిపోకపోవడం వల్ల ఇలా ఒకే శరీరానికి రెండు తలలు ఏర్పడతాయి. ఈ స్థితి లక్షల జీవులలో ఒకదానికి మాత్రమే వస్తుందని వైల్డ్‌లైఫ్ నిపుణులు చెబుతున్నారు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ రెండు తలలకు వేర్వేరు మెదడు, నాడీ వ్యవస్థలు ఉంటాయి. అంటే ఒకే శరీరంలో రెండు విభిన్నమైన ఆలోచనలు నడుస్తుంటాయి.
ఇలాంటి జీవులకు ప్రకృతిలో ఎక్కువ కాలం జీవించడం చాలా కష్టంతో కూడుకున్న పని. రెండు తలలు వేర్వేరు దిశల్లోకి వెళ్లడానికి ప్రయత్నించడం, ఆహారాన్ని వేటాడే సమయంలో రెండింటి మధ్య పోటీ ఏర్పడటం వంటి కారణాల వల్ల ఇవి శత్రు జీవుల బారిన సులభంగా పడిపోతుంటాయి.
గుజరాత్ రాష్ట్రంలో ఇలా రెండు తలలతో సజీవంగా ఉన్న పాము దొరకడం ఇదే మొదటిసారని రెస్క్యూ టీమ్ కన్వీనర్ తెలిపారు. భారతదేశంలో రికార్డైన ఇలాంటి ఐదవ ఘటన ఇది. ప్రస్తుతం ఈ అరుదైన పామును అటవీ శాఖ అధికారులకు అప్పగించి, తగిన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..