
అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) వద్ద వర్క్ పర్మిట్ రెన్యూవల్ దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైతే ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా గతంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. జో బైడెన్ ప్రభుత్వం హయాంలో ఈ ఆటోమేటిక్ పొడిగింపు గరిష్ఠంగా 540 రోజుల వరకు ఉండేది. అయితే, గత ఏడాది ఈ వెసులుబాటును తొలగిస్తూ తాత్కాలిక నిబంధన తీసుకొచ్చిన DHS.. ఇప్పుడు దానిని శాశ్వతం చేసేలా తుది నిబంధనను విడుదల చేసింది. ఈ మార్పు వల్ల వర్క్ పర్మిట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పాత విధానంలో ఆటోమేటిక్ పొడిగింపు లభించదు. దరఖాస్తుదారులను మరింత తరచుగా తనిఖీ చేయడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందని DHS పేర్కొంది. ఆశ్రయం కోరుతున్న వలసదారులు, హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా దీని పరిధిలోకి వస్తారు.
ఈ నిబంధన అక్టోబర్ 14న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురితమైన తర్వాత 30 రోజుల వ్యవధిలో అమల్లోకి వచ్చేలా రూపొందించారు. ఈ మార్పుతో వర్క్ పర్మిట్ గడువు ముగిసేలోపు రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, దాని పరిశీలన పూర్తయ్యే వరకు పని చేసే హక్కు ఆటోమేటిక్గా కొనసాగుతుందని భావించకూడదు. అయితే, వర్క్ పర్మిట్ గడువు ముగియకముందే రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు, సంబంధిత వీసా వర్గానికి వర్తించే ఇతర నిబంధనలు ముఖ్యమైనవే. అందువల్ల ఉద్యోగులు తమ పర్మిట్ గడువు, దరఖాస్తు స్థితిని ముందుగానే పరిశీలించడం అవసరం. వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేసే నిబంధన తుది రూపం దాల్చింది. కానీ గతంలో ఇచ్చిన వీసా ఆమోదాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతి పొడిగింపును కొత్తగా పరిశీలించాలనే ప్రతిపాదన ఇంకా తుది నిబంధనగా మారలేదు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలను సమర్పించేందుకు నవంబర్ 13, 2026 వరకు గడువు ఉంది.