
సెప్టెంబర్ 20, 2026న టెహ్రాన్ ఆకాశంలో ప్రకాశవంతమైన, రంగురంగుల లైట్లతో ఓ వస్తువు కనిపించినట్లు పలువురు వీడియోలతో నెట్టంట రచ్చ చేస్తున్నారు. అజాదేగాన్ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఈ వస్తువు కనిపించింది. అయితే ఈ వీడియోలు మరింత ఆసక్తికర విషయాన్ని గుర్తుచేసాయి. ఈ ఘటనకు సరిగ్గా 50 ఏళ్ల క్రితం.. టెహ్రాన్ ఆకాశంలో ఇలాగే కనిపించిన ఓ వింత వస్తువును వెంబడించేందుకు ఇరాన్ యుద్ధ విమానాలే రంగంలోకి దిగాయి!
1976 సెప్టెంబర్ 19 తెల్లవారుజామున టెహ్రాన్‌లోని షెమిరాన్ ప్రాంత ప్రజలకు ఓ వింత దృశ్యం కనిపించింది. ఆకాశంలో సాధారణ నక్షత్రం కంటే చాలా ప్రకాశవంతంగా ఓ వస్తువు కనిపిస్తుందంటూ పలువురు ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. మొదట అది నక్షత్రమే అయి ఉంటుందని భావించారు. కానీ అధికారులు స్వయంగా పరిశీలించిన తర్వాత పరిస్థితి మారింది. ఇరాన్ F-4 ఫాంటమ్ యుద్ధ విమానాన్ని ఆ వస్తువును పరిశీలించేందుకు పంపించింది. అంతేకాదు అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన డీక్లాసిఫైడ్ నివేదికలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నమోదు అయ్యాయి.
تهران ، اتوبان آزادگان
29 شهریور حوالی ساعت 19:30
از اجرام ناشناخته آسمانی فیلم گرفتم
واقعا نمیدونم چی هست ولی نزدیک ابرها بود نور های خاصی داشت و بدون هیچ صدایی در فضا معلق بود !!!
لطفا منتشر کنین همه ببینن 🙏
#یوفو #ufo #فضا #ناسا #بشقابپرنده #فرازمینی #تهران #ایران https://t.co/AHfV3FvTEb
— Ali Sedaghati (@AliiiiiSeda) September 20, 2026
1976 ఘటనలో అత్యంత ఆసక్తికర భాగం మరోటి ఉంది. మొదటి F-4 యుద్దవిమానం ఆ వస్తువు వైపు దూసుకెళ్లింది. కానీ దానికి సుమారు 25 నాటికల్ మైళ్ల దూరానికి చేరుకున్న సమయంలో విమానంలోని కొన్ని పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయడం మానేసాయి. పైలట్ ఆ వస్తువు నుంచి దూరంగా జరగడంతో వ్యవస్థలు తిరిగి పనిచేయడం ప్రారంభమయ్యాయి. దాంతో మరో F-4 యుద్ధ విమానాన్ని కూడా రంగంలోకి దించారు. రెండో విమానం ఆ వస్తువుతో రాడార్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు అమెరికా నివేదిక తెలిపింది. ఆకాశంలో కనిపించిన వస్తువు నుంచి నీలం, ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగుల కాంతులు మెరిసినట్లు పైలట్లు వివరించారు. ఇంతటితో ఆ ఘటన ముగియలేదు. ఒక చిన్న కాంతి ప్రధాన వస్తువు నుంచి విడిపోయి తమ వైపు వచ్చినట్లు పైలట్లు చెప్పిన విషయాన్ని అమెరికా రికార్డుల్లో నమోదు చేసింది. అప్పుడు పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.
రెండో F-4లో ఉన్న పైలట్ పర్విజ్ జాఫరీ ఆ చిన్న వస్తువుపై క్షిపణిని ప్రయోగించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో విమానంలోని ఆయుధ నియంత్రణ వ్యవస్థ, కమ్యూనికేషన్‌లో సమస్యలు తలెత్తినట్లు ఆయన తెలిపారు. అసలు ఆకాశంలో ఉన్నది ఏమిటి? అది ఏదైనా తెలియని విమానమా? మరో రహస్య సాంకేతిక పరికరమా? 50 ఏళ్లు గడిచినా ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. మరి శాస్త్రీయ వివరణ ఏంటి? ఈ ఘటనను ఏలియన్ లేదా UFO వాహనంగా నిర్ధారించిన ఆధారం లేదు.
అలాగే రెండో F-4లో గతంలో ఉన్న విద్యుత్ సంబంధిత సమస్యలు కొన్ని పరికరాల వైఫల్యాలకు కారణమై ఉండవచ్చని తెలిసింది. ఆ రాత్రి కనిపించిన కొన్ని కాంతులకు ఉల్కాపాతం కారణమై ఉండవచ్చని భావించారు. అమెరికా ప్రభుత్వ డీక్లాసిఫైడ్ నివేదిక కూడా ఆ వస్తువు అసలు ఏమిటో నిర్ధారించలేదు.
2026 సెప్టెంబర్ 20న టెహ్రాన్ ఆకాశంలో కనిపించిన కొత్త వీడియోల్లోనూ రంగురంగుల కాంతులతో కూడిన ఓ గుర్తుతెలియని వస్తువు కనిపిస్తోంది. అది డ్రోనా? విమానమా? మరో సాంకేతిక పరికరమా? లేక కెమెరాలో రికార్డైన సాధారణ వస్తువా? ప్రస్తుతం ఎవరి దగ్గరా ఖచ్చితమైన సమాధానం లేదు. ఇరాన్ అధికారులు కూడా దానిని గుర్తించలేదు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ప్రశ్న..
1976లో టెహ్రాన్ ఆకాశాన్ని చూసిన ప్రజలు ఒక ప్రశ్నతో నిలిచిపోయారు. “అది అసలు ఏమిటి?” ఇప్పుడు.. ఐదు దశాబ్దాల తర్వాత అదే నగరంలో మళ్లీ రంగురంగుల మిస్టరీ లైట్లు కనిపించడంతో ఆ పాత ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కూడా సమాధానం ఇంకా మిస్టరీగానే ఉంది. UFOనా? డ్రోనా? విమానమా? లేక మనకు తెలియని మరో కారణమా? టెహ్రాన్ ఆకాశంలో కనిపించిన తాజా కాంతుల వెనుక అసలు రహస్యం ఏంటో అధికారికంగా తేలే వరకు ఊహాగానాలు పుట్టుకొస్తునే ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి