Video: 3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ హోటల్ బిల్లు చూస్తే గుండె దడే.. ఎక్కడంటే?

Expensive Food Bill: సదుపాయాలు, బ్రాండ్ విలువ ఆధారంగా ధరలు నిర్ణయించడం వ్యాపార సూత్రమే అయినప్పటికీ, మరీ నిత్యావసర వస్తువులపై వందల రెట్లు లాభాలు ఆశించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది. ఏదేమైనా 5 స్టార్ హోటల్‌కు వెళ్లే ముందు మెనూ కార్డును ఒకటికి రెండుసార్లు చూసుకోవడం మంచిదనే విషయాన్ని ఈ సంఘటన నిరూపిస్తోంది.

Video: 3 బాయిల్డ్ ఎగ్స్ రూ. 500లు, పరాటా రూ. 1100లు.. ఈ హోటల్ బిల్లు చూస్తే గుండె దడే.. ఎక్కడంటే?
Expensive Food Bill

Updated on: Jun 07, 2026 | 10:05 AM

Expensive Food Bill: ముంబైలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో లంచ్ లేదా డిన్నర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం. ఒక సాధారణ ఆలూ పరాటా, మూడు ఉడకబెట్టిన గుడ్లు, కొద్దిగా పెరుగు, ఒక మిల్క్‌షేక్‌కు అయిన బిల్లు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సామాన్యుడి నెలవారీ రేషన్‌ బడ్జెట్‌ను దాటేసిన ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

గుడ్డు తింటే గండం.. బిల్లు చూస్తే గుండె గుభేల్!

మధ్యతరగతి కుటుంబాల్లో కూరగాయల ధరలు పెరిగితేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది ముంబైలోని హిల్టన్ హోటల్‌కు వెళ్లిన ఒక కస్టమర్‌కు ఎదురైన అనుభవం వింటే సామాన్యులకు చెమటలు పట్టడం ఖాయం. రాత్రి భోజనం కోసం పెద్దగా ఆడంబరాలు లేకుండా కేవలం ఒక ఆలూ పరాటా, మూడు ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఒక కప్పు పెరుగు, వెనిలా మిల్క్‌షేక్ మాత్రమే ఆర్డర్ ఇచ్చాడు. తిన్న తర్వాత చేతికి వచ్చిన బిల్లు చూసి అతడి మైండ్ బ్లాంక్ అయింది. కేవలం ఈ కొద్దిపాటి ఆహారానికి హోటల్ యాజమాన్యం వేసిన బిల్లు అక్షరాలా రూ. 2,300.

ఇందులో అన్నిటికంటే ఘోరం ఏమిటంటే, కేవలం మూడు ఉడకబెట్టిన గుడ్ల ధర రూ. 499 (పన్నులు అదనం). అంటే ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ. 170 అన్నమాట. బయట మార్కెట్‌లో రూ. 7 నుంచి రూ. 10 కి లభించే సాధారణ గుడ్డుకు ఈ రేంజ్‌లో వడ్డించడంపై సదరు కస్టమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘వాట్ ద హెల్’ అంటూ నెటిజన్ ఆవేదన..

సదరు కస్టమర్ తన ఆవేదనను నెటిజన్లతో పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. “పెద్ద హోటళ్లలో మౌలిక సదుపాయాలు, విలాసవంతమైన వాతావరణం ఉంటాయి, అందుకు తగ్గట్టుగా ధరలు ఎక్కువగా ఉంటాయని నాకు తెలుసు. దానిని నేను గౌరవిస్తాను. సాధారణ ధర కంటే నాలుగు లేదా ఐదు రెట్లు ఎక్కువ వసూలు చేసినా అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ రూ. 10 లభించే కోడిగుడ్డుకు రూ. 170 వసూలు చేయడం ఏ రకమైన న్యాయం? ఇది ముమ్మాటికీ దోపిడీనే” అంటూ సదరు యువకుడు ఆ బిల్లును వీడియోలో చూపిస్తూ వాపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

నెట్టింట రెండుగా చీలిపోయిన నెటిజన్లు..


ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది వీక్షించిన ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురుస్తోంది. కొంతమంది నెటిజన్లు హోటల్ దోపిడీని తీవ్రంగా తప్పుబడుతున్నారు. “గుడ్ల ధర రూ. 500 సరే.. ఒక ప్లేట్ పరాటా ధర రూ. 1100 అంట.. దీని గురించి ఎవరూ మాట్లాడటం లేదేంటి? ఇది మరీ దారుణం” అని ఒకరు కామెంట్ చేశారు.

అయితే మరో వర్గం నెటిజన్లు మాత్రం హోటల్ యాజమాన్యానికి మద్దతుగా నిలుస్తున్నారు. “నువ్వు ఆర్డర్ ఇచ్చింది రూమ్ సర్వీస్ ద్వారా. అర్ధరాత్రి నీ పడకగది వద్దకు వచ్చి ఆహారం అందించినందుకు ఆ సర్వీస్ ఛార్జీలు ఉంటాయి. అంతగా తక్కువ ధరలో కావాలనుకుంటే కింద ఉండే కాఫీ షాప్‌లో బఫే తినాల్సింది. 5 స్టార్ హోటల్‌కు వచ్చి రోడ్డు పక్కన ఉండే డాబా ధరలను ఆశించడం మీ అమాయకత్వమే” అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కాఫీ ధరలు ఎలా ఉంటాయో, ఇక్కడి ధరలు కూడా అంతేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us