జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజన్ల సెటైర్లు.. వినూత్నంగా స్పందించిన మంత్రి కేటీఆర్..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. బీజేపీ నేతలు తమ మాటలతో రెచ్చిపోతుంటే.. వారి వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ మంత్రి కేటీఆర్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

  • Anil kumar poka
  • Publish Date - 4:40 pm, Thu, 26 November 20
జీహెచ్ఎంసీ ఎన్నికలు: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజన్ల సెటైర్లు.. వినూత్నంగా స్పందించిన మంత్రి కేటీఆర్..

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. బీజేపీ నేతలు తమ మాటలతో రెచ్చిపోతుంటే.. వారి వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ మంత్రి కేటీఆర్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీజేపీకి సంబంధించి చిన్న అంశం దొరికినా చాలు మంత్రి కేటీఆర్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ సెటైర్ల వర్షం కురిపించారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలంటూ బీజేపీ పెద్దలకు చురకలంటించారు. టీఆర్ఎస్ చేసిన పనులనే బీజేపీ మేనిఫెస్టోలో మక్కీకి మక్కి దింపారని పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గురువారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా విడుదల చేశారు.


అయితే బీజేపీ మేనిఫెస్టోను పరిశీలించిన ఓ నెటిజన్.. టీఆర్ఎస్ చేసిన పనులనే ఫోటోలు తీసి బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారంటూ సబంధింత అంశాలను హైలెట్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి మంత్రి కేటీఆర్‌ని కూడా ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై సెటైర్లు పేల్చాడు. ‘కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి. బండన్న.. నీ తెలివికి దండం’ అంటూ కామెంట్ మెన్షన్ చేశాడు. అయితే ఇది గమనించిన కేటీఆర్ సదరు నెటిజన్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ బీజేపీ నేతలకు సుతిమెత్తగా చురకలంటించారు. ‘బీజేపీ మేనిఫెస్టోని తయారు చేసిన వారికి కృతజ్ఞతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను బీజేపీ మేనిఫెస్టోలో యధాతథంగా పెట్టడం సంతోషంగా ఉంది. ఈ చర్యను మేము అభినందనగా స్వీకరిస్తాము. అయితే హైదరాబాద్ ప్రజలు కూడా ఏం అనుకుంటున్నారో మీకు గుర్తు చేస్తున్నాను.’ అంటూ సదరు నెటిజన్ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ బీజేపీ నేతలకు పరోక్షంగా అక్షింతలు వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వరైరల్ అవుతోంది.