
విదేశాల్లో ఖరీదైన మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో చాలా మంది వాటిని కొంటుంటారు. అయితే విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చేటప్పుడు కొన్ని వస్తువులపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి వస్తుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి, కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ చెల్లించాలని ఒత్తిడి చేసారు. వ్యక్తిగత వినియోగం కోసమే ఐఫోన్ కొనుగోలు చేశానని చెప్పిన ప్రయాణికుడు.. అన్యాయంగా ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదంటూ నిరసనకు దిగాడు. చివరకు అతనిపై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇంతకీ ఏం జరిగింది?
కేరళలోని కోజికోడ్‌కు చెందిన అజాస్ మహమ్మద్ ఇటీవల దుబాయ్‌లో ఐఫోన్ 18 ప్రో కొనుగోలు చేశాడు. అనంతరం భారత్‌కు తిరిగి వస్తూ కొచ్చిలోని నెడుంబస్సేరి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి, ఆల్రెడీ అతని వద్ద మరొక ఫోన్ ఉందని తెలుసుకుని, కొత్త ఫోన్‌కు కస్టమ్స్ సుంకం చెల్లించాలని కోరారు. అభ్యంతరం వ్యక్తం చేసిన అజాస్ మహమ్మద్ ఫోన్‌ను వ్యక్తిగత వినియోగం కోసమే కొనుగోలు చేశానని, కస్టమ్స్ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించాడు. దీంతో అధికారులు అతని ఫోన్‌ను సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులు తన ఫోన్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ అజాస్ మహమ్మద్ విమానాశ్రయంలోనే బైఠాయించాడు. ‘అన్యాయంగా ఒక్క రూపాయి కూడా చెల్లించను’ అంటూ నిరసన ప్రకటించడంతో CISF సిబ్బంది అతనిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. కస్టమ్స్ అధికారుల విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణతో నెడుంబస్సేరి పోలీసులు కేసు నమోదు చేసారు.
భారత ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కొత్త బ్యాగేజ్ రూల్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. భారత సంతతికి చెందిన పర్యాటకులు, విదేశీ పౌరులు విమానం లేదా సముద్ర మార్గం ద్వారా భారత్‌కు వచ్చేటప్పుడు కొన్ని షరతులకు లోబడి రూ.75,000 వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా తీసుకురావచ్చు. విదేశీ పర్యాటకులకు ఈ పరిమితి రూ.25,000గా ఉంది. రూ. 75,000కు పైబడి విలువ ఉన్న కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను తెచ్చినప్పుడు వాటిపై కస్టమ్స్ సుంకం చెల్లించాలి. ప్రయాణికుడి వద్ద ఇప్పటికే ఒక ఫోన్ ఉండి, బాక్స్ ప్యాకింగ్‌తో ఉన్న సరికొత్త ప్రీమియం ఫోన్‌ను తెచ్చినందుకు అధికారులు కస్టమ్స్ డ్యూటీ విధించారు