70 ల్యాండ్‌మైన్లు, వేల ప్రాణాలు.. వేలాది ప్రాణాలు కాపాడిన చిన్న హీరో.. కథ తెలిస్తే..
ప్రపంచవ్యాప్తంగా జరిగే సాహస గాథలలో తరచుగా మనుషులు, కుక్కలు, పిల్లులు, ఏనుగులు భాగమై ఉంటాయి. కానీ కొన్నిసార్లు, ఒక చిన్న జీవి కూడా చరిత్ర పుటలలో లిఖించబడే నిజంగా అద్భుతమైన కార్యాన్ని సాధించగలదు. అలాంటి ఒక ఉదాహరణే మాగావా. అది తన విశిష్టమైన సామర్థ్యాలు, పట్టుదలతో వేలాది ప్రాణాలను కాపాడింది. ఎనిమిదేళ్ల వయసులో అది చనిపోయిందన్న వార్త తెలియగానే, చాలా మంది చలించిపోయారు. అసలు మాగావా ఎవరో, అది ప్రజల అభిమానాన్ని ఎందుకు చూరగొందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎలుకలు అంటే మనకు ఇబ్బంది కలిగించే జంతువులుగా తెలుసు. కానీ, ఒక ఎలుక మాత్రం తన ప్రాణాలకు తెగించి వేలాది మంది మనుషుల ప్రాణాలను కాపాడి ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతుడైన ఎలుకగా గుర్తింపు పొందింది. దాని పేరే మగావా. మగావా ఒక ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్. టాంజానియాకు చెందిన APOPO అనే స్వచ్ఛంద సంస్థ దీనికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మగావా తన అద్భుతమైన ఘ్రాణ శక్తితో పేలుడు పదార్థాల్లోని రసాయన వాసనను పసిగట్టగలదు. కంబోడియాలో యుద్ధ సమయంలో అమర్చిన ప్రమాదకరమైన ల్యాండ్‌మైన్లను (భూగర్భ గనులు) కనిపెట్టడంలో మగావా కీలక పాత్ర పోషించింది.
మగావా 1.2 కిలోగ్రాముల బరువు, 70 సెంటీమీటర్ల ఎత్తు ఉండేది. మగావా గొప్ప బలం దాని తేలికదనం. అది ఎంత తేలికగా ఉండేదంటే, ల్యాండ్‌మైన్‌ల మీద నడిచినా కూడా అవి పేలవు. తన పని సమయంలో మగావాను ఒక తాడుకు కట్టి, ఒక ప్రాంతమంతా అటూ ఇటూ నడిపించేవారు. గన్‌పౌడర్ వాసన రాగానే, అది నేలను గోకి తనను నడిపించే వ్యక్తికి సంకేతం ఇచ్చేది. ఘాటైన వాసనను గుర్తించడం, వినికిడి శక్తి, చురుకుదనం మగావాను హీరోగా నిలబెట్టింది.
మగావా తన ఐదేళ్ల కెరీర్‌లో 71 ల్యాండ్‌మైన్లను, 38 సజీవ పేలుడు పదార్థాలను గుర్తించింది. దాదాపు 20 ఫుట్‌బాల్ మైదానాలతో సమానమైన (1.41 లక్షల చదరపు మీటర్లు) స్థలాన్ని గనులు లేకుండా శుభ్రం చేయడంలో సహాయపడింది. మనుషులు మెటల్ డిటెక్టర్లతో గంటల కొద్దీ చేసే పనిని, మగావా కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయగలదు. మగావా చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా బ్రిటన్‌కు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ PDSA, దీనికి గోల్డ్ మెడల్ (బంగారు పతకం) ప్రదానం చేసింది. సాధారణంగా ధైర్యసాహసాలు ప్రదర్శించే కుక్కలకు ఇచ్చే ఈ మెడల్‌ను అందుకున్న మొదటి ఎలుకగా మగావా చరిత్ర సృష్టించింది.
మగావా 2021లో తన విధుల నుండి పదవీ విరమణ పొంది, 2022 ప్రారంభంలో ఎనిమిదేళ్ల వయస్సులో మరణించింది. అయినప్పటికీ, ఒక చిన్న జీవి ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో చెప్పడానికి మగావా జీవితం ఒక గొప్ప ఉదాహరణ. వేలాది మంది ప్రజలు తమ పొలాల్లో భయం లేకుండా తిరుగుతున్నారంటే అది మగావా చేసిన ప్రాణదానమే!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




