దూద్‌సాగర్ జలపాతం.. దీని గురించి తెలియనివారు ఉండరు. భారత్‌లోని అతి పొడవైన(310 మీటర్లు) జలపాతంగా దీనికి పేరుంది. మాండవీ నది కర్ణాటకలోని బెలగావి నుంచి మొదలయ్యి.. పశ్చిమ కనుమల నుంచి పనాజీ, ఆపై అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రయాణంలోనే వాటర్ ఫాల్స్ రూపుదిద్దుకుంటాయి.
ఇదిలా ఉంటే ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. మరీ ముఖ్యంగా గోవా- బెంగళూరు రైలు మార్గంలో ఉన్న జలపాతాల సెలఏరులు గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆ ప్రయాణం మధ్యలో కనిపించే వాటర్ ఫాల్స్ సీన్‌కు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇక తాజాగా భారీ వర్షాల దాటికి దూద్‌సాగర్ జలపాతం వెల్లువలా దూకుతున్న ఓ వీడియో నెటిజన్లను కనువిందు చేస్తోంది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు జలపాతం ఉగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం పెరగడంతో గోవా-బెంగళూరు రైలును మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. దానికి సంబంధించిన వీడియోను ప్రసార భారతీ న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ”దృశ్యం చూడటానికి ఎంతో రమణీయంగా ఉన్నా.. కాసింత భయంగానూ ఉందని” ఒకరు కామెంట్ చేయగా.. ”పాపం! ఆ రైలులోని ప్యాసింజర్‌లు చాలా భయపడి ఉంటారేమో” అంటూ మరొకరు కామెంట్ చేశారు.