‘‘మీకే కాదు మాకు కూడా ఫొటోకు పోజ్ ఇవ్వడం తెలుసని’’ ఆ గొరిల్లాలు అనుకుంటున్నట్లు పై ఫొటోను చూస్తే మీకు అనిపిస్తోంది కదూ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫొటో వెనుక ఉన్న కథ కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది.
ఈ ఆడ గొరిల్లాలు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోగా.. కాంగోలోని విరుంగ నేషనల్ పార్క్‌కు చేరాయి. అప్పటి నుంచి పార్క్ సంరక్షుల చేతిలో పెరిగిన ఈ గొరిల్లాలకు వారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాథ్యూ శామూవు అనే జంతు సంరక్షుడు ఇటీవల వాటితో ఓ ఫొటోను తీసుకున్నాడు. దానికి ఆఫీస్‌లో మరో రోజు అనే కామెంట్ పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతే 22,000 షేర్లతో ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా డకజీ, డేజ్ అనే పేర్లతో పిలవబడే ఈ ఆడ గొరిల్లాలు ఫొటోకు ఇచ్చిన పోజ్ అందరికీ తెగ నచ్చేసింది. ముఖ్యంగా డేజ్(వెనుకాల ఉన్న గొరిల్లా) అచ్చు మనిషిలాగే చేయడంపై నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఫొటోపై ఆ పార్క్ సోషల్ మీడియాలో స్పందించింది. ‘‘అవును ఇది నిజమే. ఈ రెండు గొరిల్లాలు ఎప్పుడూ చాలా చలాకీగా ఉంటాయి. వారి కాళ్ల మీద అవి నిలబడం పెద్ద వింతేం కాదు. వాటి నిజ జీవిత వ్యక్తిగతానికి సంబంధించి ఈ ఫొటో ఒక నిదర్శనం మాత్రమే’’ అంటూ పేర్కొంది.