Work from home: వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఆఫీస్‌ సమయం వృథా చేసిందని షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

|

Jan 19, 2023 | 1:54 PM

కెనడాకు చెందిన కార్లే బెస్సె అనే మహిళ.. స్థానిక బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. కారణం తెలియదు కానీ.. గత ఏడాది ఆమెను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

Work from home: వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఆఫీస్‌ సమయం వృథా చేసిందని షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు
Work From Home
Follow us on

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌కి అనుమతిచ్చాయి. దీంతో ఉద్యోగులకు ఇంటినుంచే స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం దొరికింది. అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కెనడాకు చెందిన కార్లే బెస్సె అనే మహిళ.. స్థానిక బ్రిటిష్‌ కొలంబియాలోని ఓ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. కారణం తెలియదు కానీ.. గత ఏడాది ఆమెను ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తనకు పరిహారం చెల్లించాలని ఆ ఉద్యోగిని సంస్థను డిమాండ్‌ చేసారు. ఈ విషయమై సదరు మహిళ కోర్టును ఆ్రశయించారు. అయితే ఆ మహిళ ఆఫీసు సమయాన్ని వృథా చేసినందుకు గాను ఆ మహిళే తిరిగి సంస్థకు 3 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పింది కోర్టు.

తన వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పర్యవేక్షిస్తారంటూ సంస్థపై ఆరోపణలు చేసారు సదరు మహిళ. అయితే మహిళ ఆరోపణలను సంస్థ తోసిపుచ్చింది. కేవలం ఆఫీస్‌ డాక్యుమెంట్లను మాత్రమే తమ సాఫ్ట్‌వేర్‌ పర్యవేక్షిస్తుందని సంస్థ వివరించింది. తమ సాఫ్ట్‌వేర్‌ ఎంత కచ్చితంగా పనిచేస్తుందోననే విషయాన్ని కూడా వివరించింది. 50గంటలపాటు ఆమె లాగిన్‌ అయినట్లు చూపించినప్పటికీ ఆ సమయంలో తనకు ఇచ్చిన పని మాత్రం చేయలేదని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ విశ్లేషణను కోర్టు ముందు ఉంచింది. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఉద్యోగిని తొలగించిన వ్యవహారాన్ని పక్కన బెడితే.. కంపెనీ సమయాన్ని వృథా చేసినందుకు ఆ మాజీ ఉద్యోగినే సంస్థ నుంచి వివిధ రూపాల్లో పొందిన ప్రయోజనాల మొత్తం 3లక్షలు తిరిగి చెల్లించాలంటూ ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

ఆఫీస్‌ సమయాల్లో ఉద్యోగి పనిచేస్తున్నారా? లేదా? అనే విషయాన్ని టైమ్‌క్యాంప్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సహాయంతో సదరు కంపెనీ పర్యవేక్షించేదట. ఆఫీస్‌ డాక్యుమెంట్లను ఎంత సేపు ఓపెన్‌ చేసి ఉంచారు, వాటిని ఎలా ఉపయోగించారనే విషయాలను ఈ సాఫ్ట్‌వేర్‌ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో కార్లే బెస్సె ఆఫీస్‌ టైంలో ఎక్కువగా కంప్యూటర్‌కు దూరంగా ఉన్నట్లు తేలిందని ఆ సంస్థ వెల్లడించింది.