తల్లి అంత్యక్రియల తేదీపై తప్పుడు సలహా ఇచ్చిన AI చాట్ బాట్! కోర్టుకెక్కిన వ్యక్తి!

తన తల్లి అంత్యక్రియల తేదీ విషయంలో ఏఐ తప్పుడు సలహా పాటించడం వల్లే కుటుంబానికి అరిష్టం పట్టిందని ఆరోపిస్తు ఒక చైనా వ్యక్తి కంపెనీపై కేసు పెట్టాడు.  తన తల్లి అంత్యక్రియలు ఎప్పుడు చేయాలో చాట్‌బాట్‌ను అడిగి, అది చెప్పిన తేదీనే ఏర్పాట్లు చేశాడు. అయితే ఆ తర్వాత తన కుటుంబంలో వరుస కష్టాలు రావడానికి ఏఐ సలహానే కారణమని అతను ఆరోపిస్తున్నాడు. 

తల్లి అంత్యక్రియల తేదీపై తప్పుడు సలహా ఇచ్చిన AI చాట్ బాట్! కోర్టుకెక్కిన వ్యక్తి!
Chinese Man Sues Ai Company Over Mother Burial Date

Updated on: Sep 21, 2026 | 12:53 PM

‘జిము న్యూస్’ కథనం ప్రకారం.. జెజియాంగ్ ప్రావిన్సులోని జియాషాంగ్ కౌంటీకి చెందిన ‘షి’ అనే వ్యక్తి తల్లి ఏప్రిల్‌లో అకస్మికంగా చనిపోయారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియల ఏర్పాట్లలో పడ్డారు. ఐదుగురు తోబుట్టువులలో చిన్నవాడైన షి, తన తల్లి అంత్యక్రియలకు ఒక మంచి రోజును  ఎంపిక చేయాలనుకున్నాడు. చైనీస్ సాంప్రదాయంలో నక్షత్రాలు, గ్రహాల గతుల ఆధారంగా మంచి రోజును ఎంచుకుంటారు. ఇప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని కుటుంబాలు ఈ పద్ధతినే పాటిస్తుంటాయి.

మొదట షి అతని కుటుంబ సభ్యులు ఒక ఫెంగ్ షూయి నిపుణుడిని సంప్రదించగా,  అంత్యక్రియల కోసం ఏప్రిల్ 20వ తేదీని ఆయన సిఫార్సు చేశారు. అయితే, ఆ తేదీ తన తల్లి చనిపోయిన నాలుగో రోజు అవుతుందని తెలుసుకుని షి ఆందోళన చెందాడు. కొన్ని స్థానిక ఆచారాల ప్రకారం, అంత్యక్రియలకు సరి సంఖ్య వచ్చే రోజును అరిష్టంగా భావిస్తారు. మరో అభిప్రాయం కోసం షి ఏఐ చాట్‌బాట్‌ను సలహా అడగ్గా ఏప్రిల్ 19వ తేదీని సిఫార్సు చేసింది. అంతేకాకుండా,  కొన్ని కాగితాలను దహనం చేయాలని కూడా ఆ కుటుంబానికి సలహా ఇచ్చింది. మరణం తరువాత జరిగే ప్రయాణానికి మృతులకు అవసరమైన వస్తువులు ఈ ఆచారం ద్వారా అందుతాయని సాంప్రదాయంగా నమ్ముతారు.

అయితే, తర్వాతి రోజు ఆ చాట్‌బాట్ ఇచ్చిన సలహాలో పొంతన లేకపోవడాన్ని షి గమనించాడు. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య అంత్యక్రియలు చేయాలని అది సూచించినప్పటికీ, మరోవైపు ఏప్రిల్ 19 మంచి రోజు కాదని కూడా తెలిపింది. అప్పటికే షి బంధువులందరికీ అంత్యక్రియల ఏర్పాట్ల గురించి చెప్పేసి ఉండటంతో, తేదీని మార్చడం సాధ్యం కాదని భావించాడు. అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికే, అతని బంధువు ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.  తప్పుడు తేదీలో అంత్యక్రియలు చేయడం వల్ల కుటుంబంలో ఫెంగ్ షూయి దెబ్బతిని, దురదృష్టం వెంటాడిందని భావించిన అతని కుటుంబ సభ్యులు.. ఆ ప్రమాదానికి  అంత్యక్రియల తేదీనే కారణమని ఆరోపించారు.

తన కాంట్రాక్టు పనుల కోసం తరచూ ఏఐ టూల్స్ వాడే షి, ఆ చాట్‌బాట్ తనకు తప్పుడు సమాచారం ఇచ్చిందని యాక్సిడెంట్ ఘటన తన కుటుంబంలో గొడవలకు, మనస్పర్థలకు దారితీసిందని ఆరోపించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రకారం,   సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ‘బీజింగ్ చుంటియాన్ జియున్ టెక్నాలజీ’ కంపెనీపై దావా వేసాడు. తనకు క్షమాపణ చెప్పాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. అయితే ఎంత పరిహారం డిమాండ్ చేసాడనే వివరాలను పత్రిక వెల్లడించలేదు.  దావా వేసే సమయంలో షి అదే ఏఐ చాట్‌బాట్‌ను ఉపయోగించడం విశేషం.  ఆ సాఫ్ట్‌వేర్ లీగల్ డాక్యుమెంట్లను డ్రాఫ్ట్ చేయడంలో, అలాగే కేసు వేయడానికి అవసరమైన ప్రక్రియను అర్థం చేసుకోవడంలో షీకి సహాయపడింది.

అయితే కంపెనీ నిబంధనల ప్రకారం.. ఏఐ (AI) కేవలం సూచన మాత్రమే చేస్తుంది దానిని వృత్తిపరమైన సలహాగా భావించకూడదు. ఆ చాట్‌బాట్ ఇచ్చిన సమాచారం ఆన్‌లైన్ ఉల్లంఘన కిందకు రాదని  కంపెనీ కోర్టుకు తెలిపింది. అయితే షి యూజర్ అగ్రిమెంట్ నిబంధనలను సవాలు చేసాడు.  ఏఐ తగిన హెచ్చరికలు ఇవ్వడం లేదని,  సమాచారం రూపొందించడానికి ఉపయోగిస్తున్న సోర్స్‌పై తగిన నిఘా లేదని వాదించడంతో కేసులో పురోగతి సాధించినట్లయింది. కృత్రిమ మేధస్సు (AI) మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, మానవ ప్రమేయం లేకుండా కేవలం ఏఐ పైనే ఆధారపడి, దానిని పూర్తిగా నమ్మితే అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని  షి కేసు నిరూపించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us