Viral Video: అందరూ డ్రైవర్‌లు ఇలాగే ఉంటే.. ప్రమాదాలే జరగవు. వైరల్‌ అవుతోన్న వీడియో..

|

Oct 21, 2024 | 8:27 AM

ప్రతీ రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్లు విస్తరిస్తున్నా, అధునాతన ఫీచర్లతో కూడిన వాహనాలు వస్తున్నా.. రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. తాజాగా ఓ బస్సు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ బస్సు డ్రైవర్ చేసిన పనెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Viral Video: అందరూ డ్రైవర్‌లు ఇలాగే ఉంటే.. ప్రమాదాలే జరగవు. వైరల్‌ అవుతోన్న వీడియో..
Viral Video
Follow us on

ప్రపంచంలో వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా గణంకాలు చెబుతున్నాయి. ప్రపంవ్యాప్తంగా ప్రతీ రోజూ ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. న్యూస్‌ పేపర్‌ ఓపెన్‌ చేసి చూస్తే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలు కామన్‌గా కనిపిస్తున్నాయి. ఎన్నో రకాల రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరీ ముఖ్యంగా వాహనాలను ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో చేసే తప్పులే ప్రమాదాలకు కారణమవుతాయి. రాత్రుళ్లు ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించకుండా వేగంగా దూసుకెళ్తుంటారు. దీంతో అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా సింగిల్‌ రోడ్లపై ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ డ్రైవర్లు చాకచక్యంతో వ్యవహరిస్తే మనం ప్రమాదాల బారిన పడడం మాత్రమే కాకుండా, మన వెనకాల వచ్చే వారు కూడా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. తాజాగా ఓ బస్సు డ్రైవర్‌ చేసిన ఇలాంటి ఓ పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా.. రాత్రి సమయంలో సింగిల్‌ లేన్‌ ఉన్న రహదారిపై ఓ బస్సు వెళ్తుంది. దాని వెనకాలే ఓ కారు కూడా శరవేగంగా దూసుకుపోతోంది. బస్సును ఓవర్ టేక్‌ చేయాలని కారు డ్రైవర్‌ ప్రయత్నిస్తున్నాడు. అయితే అందలోనే అటువైపుగా వాహనాలు వస్తున్నాయి. కానీ ఈ విషయం కారు నడిపిస్తున్న వ్యక్తికి కనిపించడం లేదు. ఇది గమనించిన బస్సు డ్రైవర్‌.. ఒక ట్రిక్‌ ప్లే చేశాడు.

ఎప్పుడైతే.. కారు డ్రైవర్‌ బస్సును ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించే సమయంలో ఎదురుగా ఏదైనా వాహనం వస్తున్న వెంటనే.. బస్సు డ్రైవర్ ఎడమవైపున్న ఇండికేటర్‌ను హెచ్చరికగా ఆన్ ఆఫ్ చేశాడు. దీంతో, కారు డ్రైవర్ తన ప్రయత్నాన్ని మానుకున్నాడు. ఆ మరుక్షణమే ఎదురుగా ఓ కారు రయ్యని దూసుకుపోయింది. దీంతో కారు డ్రైవర్‌కు అసలు విషయం అర్థమైంది. ఇలా మరో రెండు సార్లు డ్రైవర్‌ ఇలాగే అలర్ట్‌ చేశాడు. చివరిగా రైట్ సైడ్‌ ఇండికేటర్‌ వేయడంతో ఎదురుగా ఎలాంటి వాహనం రావట్లేదని అర్థం చేసుకొని ఓవర్ టేక్‌ చేసేశాడు.

దీనంతటినీ కారులో ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బస్సు డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కారు, బస్సు డ్రైవర్ల మధ్య కోఆర్డినేషన్‌ అద్భుతంగా ఉందని, ఇలాంటి డ్రైవర్లు ఉంటే అసలు ప్రమాదాలనేవే జరగవు అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..