ఉగ్రవాదంపై శ్రీలంక పోరుకు బాసట..మోదీ

టెర్రరిజంపై శ్రీలంక చేస్తున్న పోరాటానికి భారత్ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తోందని అన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదం వంటి పిరికి చర్యలు లంక లక్ష్యాన్ని దెబ్బ తీయజాలవని ఆయన చెప్పారు. ఈ దేశ ప్రజలకు తాము ఎప్పుడూ బాసటగా ఉంటామని మోదీ పేర్కొన్నారు. గత ఏప్రిల్ 21 న ఈస్టర్ పండుగ రోజున లంకలో టెర్రరిస్టు దాడులకు గురైన చర్చీల్లో ఒకదాన్ని ఆయన ఆదివారం సందర్శించి.. మృతులకు నివాళి అర్పించారు. (ఆ ఘటనలో 250 మందికి పైగా మరణించగా..సుమారు 500 మంది గాయపడ్డారు. స్థానిక జిహాదీ గ్రూప్, ఐసిస్ అనుబంధ విభాగమైన నేషనల్ తౌహీత్ జమాత్..తామే ఆ ఘటనకు కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే). అయితే టెర్రరిస్టు దాడుల నుంచి లంక పూర్తిగా కోలుకుని వారిపై పోరును ఉధృతం చేస్తోందని, వారి స్ఫూర్తి అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. మొదట లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే కొలంబో విమానాశ్రయంలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. అధ్యక్ష భవనానికి మోదీ వెళ్తుండగా.. జరిగిన సెరిమనీ సందర్భంలో వర్షం పడుతున్న వేళ.. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన స్వయంగా ఆయనకు గొడుగు పట్టి తడిసిపోకుండా ఆయన వెంట నడవడం విశేషం. అనంతరం ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. కాగా-మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో తాను జరిపిన పర్యటన వీటికి, భారత్ కు మధ్య సంబంధాలను మరింత పరిపుష్టం చేస్తుందని మోదీ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *