భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9: అడవుల్లో జీవించే ఆదివాసీల జీవన విధానం భిన్నంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అడవుల్లో ఆయా సీజన్‌లలో దొరికే దుంపలు, గోంగూర, చింతపండు, మిరపకాయలు వంటి వాటితో కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేకరణ కష్టంగా మారితే మనలా హోటల్లకు వెళ్లి తినలేరు కదా? మరైతే ఏం తింటారని అనుకుంటున్నారా..? ఎర్రచీమలతో పచ్చడి నూరుకుని ఆరగిస్తారట. ఇప్పుడిప్పుడే వారి జీవన విధానం నుంచి బయటప్రపంచంలోకి అడుగుపెడుతోన్న ఆదివాసీలు వారి ఆహారపు అలవాట్లలో ఐతం కొంత మార్పు చోటు చేసుకుంటోంది.
రెండు దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలు వలస వచ్చి నివాసం ఉంటున్నారు. ఇలా ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలలో వలస ఆదివాసీలకు చెందిన అనేక తెగలు నివాసం ఉంటున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మంది ఎటువంటి సౌకర్యంలేని అటవీ ప్రాంతాల్లోనే నివసం ఉంటున్నారు. పోడు సాగు, ఇంటి ఆవరణలో పెరటి పంట పండించుకోవడం వంటి వాటితో పంటలు పండిస్తున్నారు. వానాకాలంలో గోంగూర, ఎండాకాలంలో చింతకాయలు వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా గోంగూర ఎండబెట్టుకుని ఎండాకలం వచ్చేవరకూ వాడుకుంటారు.
గోంగూరతో చెంచలి కూర, బొద్దుకూర, నాగళి, టిక్కల్ అనే ఆకుకూరలు, చామ, ఆలు వంటి దుంపలను కూడా వండుకుంటారు. పోడు సాగులో భాగంగా ఆదివాసీలు అడవిని నరికే క్రమంలో ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లను మాత్రం ముట్టుకోరు. ఇప్ప సారా ఆదివాసీలకు చాలా స్పెషల్. వసంత కాలం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఆ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారట. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఉండే ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరించి ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారట. ఈ చట్నీని బస్తరియా అనే పేరుతో పిలుస్తారు. ఈ పచ్చడిని ఆదివాసీలు చాలా ఇష్టంగా ఆరగిస్తారట ఎర్రచీమల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని, వాటిల్లో ఫామిక్ యాసిడ్‌తోపాటు ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయట.
జ్వరం, జలుబు, దగ్గు, కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆదివాసీలు నమ్ముతారు. ఆదివాసీల్లో ఆనారోగ్యం తలెత్తితే చీమల చికిత్సకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాల స్థానంలో బియ్యానికి అలవాటు పడుతున్నారు. జొన్నలు, సజ్జలతో తయారు చేసిన ఆహారం తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి వేయదు. కానీ బియ్యంతో చేసిన అన్నం రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోందని ఆదివాసీలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే వీరి ఆహార అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. బియ్యం అన్నం, ఆవు పాలనూ ఆహారంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని ఆదివాసీలు చీమల చట్నీని ఔషధపరంగా ఉపయోగిస్తుండటంతో.. ఈ చట్నీకి జీఐ టాగ్ సైతం లభించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.