AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల భద్రతకు కీలక అడుగు.. బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లతో రోడ్డెక్కిన మహిళా డ్రైవర్లు!

మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘స్త్రీ రైడ్ – ఉమెన్ డ్రైవర్స్ ఇనిషియేటివ్’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం పరస్పరం అనుసంధానమైన అంశాలని, వారికి రవాణా రంగంలో గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో మరింత బలమైన స్థానాన్ని అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

మహిళల భద్రతకు కీలక అడుగు..  బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లతో రోడ్డెక్కిన మహిళా డ్రైవర్లు!
Stree Ride Launched By Dgp Cv Anand
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 8:07 PM

Share

మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘స్త్రీ రైడ్ – ఉమెన్ డ్రైవర్స్ ఇనిషియేటివ్’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం పరస్పరం అనుసంధానమైన అంశాలని, వారికి రవాణా రంగంలో గౌరవప్రదమైన ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో మరింత బలమైన స్థానాన్ని అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం తొలి దశలో భాగంగా 50 మంది మహిళా బైక్ రైడర్లు, నలుగురు మహిళా ఆటో డ్రైవర్లు, ఒక మహిళా క్యాబ్ డ్రైవర్‌కు ప్రత్యేక శిక్షణ అందించారు. MAWO సీఈఓ జై భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు ‘మహీంద్రా ఆటో’ సంస్థ వాహనాలను అందించగా.. Bigili, Zippi, MAWO సంస్థలు కలిసి వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లు అందుబాటులోకి రావడం వల్ల మహిళా ప్రయాణికుల్లో భద్రతాభావం మరింత పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

కుటుంబాల మద్దతు అవసరం: డీజీపీ సి.వి. ఆనంద్

కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రొఫెషనల్ డ్రైవర్లుగా మారడం సంతోషకరమన్నారు. “మహిళల విజయంలో కుటుంబ సభ్యుల పాత్ర అత్యంత కీలకం. భర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల ప్రోత్సాహం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టిస్తారు” అని ఆయన పేర్కొన్నారు. గతంలో తాను సైబరాబాద్ సీపీగా ఉన్నప్పుడు SHE Teams, SHE Cabs ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, మహిళల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రోడ్లపై పనిచేసేటప్పుడు ఆకతాయిల వల్ల ఏవైనా సవాళ్లు ఎదురైతే పోలీసులు తక్షణమే అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు.

దేశ రక్షణలో మహిళలు ఇప్పటికే ఫైటర్ పైలట్లుగా రాణిస్తున్నారని, అదే స్ఫూర్తితో రవాణా, సేవా, ఉత్పత్తి రంగాల్లోనూ ముందుకు రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. స్త్రీ రైడ్ అనేది కేవలం ఒక రవాణా కార్యక్రమం మాత్రమే కాదని, మహిళల్లో ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని నింపే ఒక సామాజిక ఉద్యమమని అధికారులు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా తదితర ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us