AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. అమ్మకానికి బావి, చెరువు నీళ్లు.. ఆశ్చర్యపోతున్న జనాలు

ఒకవైపు ఎల్‌నినో ప్రభావం.. మరోవైపు వర్షాభావ పరిస్థితులు. చినుకు కోసం ఎదురుచూస్తున్న రైతులకు నీరే ఇప్పుడు జీవనాధారం. చెరువులు, కుంటలు, బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా సాగుకు వినియోగించుకోలేని పరిస్థితి వస్తే..? ఆ నీటినే వేలం వేసి అమ్ముకుంటే..? ఇదే ఇప్పుడు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియాపూర్ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. నీటి కొరతతో పంటలు ఎండిపోతున్న తరుణంలో నీటిని అమ్ముకోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. అమ్మకానికి బావి, చెరువు నీళ్లు.. ఆశ్చర్యపోతున్న జనాలు
Outrage In Wanaparthy Village Over Sale Of Nallacheruvu And Well Water
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Nov 14, 2026 | 4:39 PM

Share

ఎల్ నినో కారణంగా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఇప్పటికే వ్యవసాయం సాగు సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వనపర్తి జిల్లాలోని మియాపూర్ గ్రామంలోని నల్లచెరువు, ఊరకుంట, ఊరబావి నీటి వ్యవహారం వివాదానికి దారితీసింది. గతంలో చేపల పెంపకం కోసం చెరువును వేలం వేశారు. చేపల పెంపకం పూర్తయిన తర్వాత చెరువులో మిగిలిన నీటిని విక్రయిస్తున్నారు వేలం పొందిన జాలర్లు. దీంతో నీటి అవసరాలు ఉన్న రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెరువు నీటిని అమ్ముకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

సాగు నీరు కావాలంటే ఒక్కో మోటారుకు రూ.7 వేల చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులకు ఈ మొత్తం అదనపు భారంగా మారింది. డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో కొందరు రైతులు పంటలకు నీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే నల్లచెరువు నీటి విక్రయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న వేళ తాజాగా గ్రామంలోని ఊరబావి నీటిని సైతం వేలం వేశారు. దీంతో గ్రామంలో నీటి వినియోగంపై వివాదం నెలకొంది. చెరువులు, కుంటలు, బావుల్లోని నీటిని వేలం వేయడంపై కొంతమంది గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నీటి కొరతతో అల్లాడుతున్న రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ఇప్పటికే సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో నీటిని కూడా అమ్ముకునే పరిస్థితి వస్తే భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అన్న ప్రశ్నలు మియాపూర్‌లో వినిపిస్తున్నాయి. నీటి విలువ తెలిసిన కష్టకాలంలోనే.. నీటిని వేలం వేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us