వరంగల్, జనవరి 31: గత ఏడాది రైతులకు సిరుల వర్షం కురిపించింది ఎర్ర బంగారం. కానీ ఈ ఏడాది మాత్రం కన్నీరు పెట్టేలా చేస్తుంది. మార్కెట్ లో అమ్మకానికి మిర్చి పోటెత్తుతుంది.. కానీ ధరలు చూసి రైతులు దిగులు చెందుతున్నారు. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్‌గా గుర్తింపున్న వరంగల్‌లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు ఎర్రబంగారం పోటెత్తింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా మిర్చిని అమ్మకానికి తరలిస్తున్నారు.. దీంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కిటకిటలాడుతోంది.
నెల రోజుల వ్యవధిలో 1లక్ష 28 వేల క్వింటాల మిర్చి అమ్మకానికి తీసుకొచ్చారు. మార్కెట్ యార్డులో ఎటు చూసినా ఎర్ర బంగారమే తివాచీ పరిచినట్లు కనిపిస్తుంది.. ప్రస్తుతం రైతులు తీసుకువస్తున్న మిర్చిలో తేజా, వండర్ హార్ట్, 341, దేశీరకం మిర్చి అమ్మకానికి తీసుకు వస్తున్నారు.. ఈ వ్యవసాయ సీజన్ లో తేజారకం ఇప్పటివరకు 20,400 రూపాయలు టాప్ ధరగా నమోదయింది.. వండర్ హార్ట్ – 18, 000రూ, 341రకం – 16,500, దేశీ రకం 32,000 రూ.. అధిక ధరలుగా నమోదయ్యాయి..
గత రెండు సంవత్సరాల నుండి రికార్డులు సృష్టిస్తున్న మిర్చి ధరలు వూహించని విధంగా ఢీలా పడ్డాయి.. కొండంత ఆశతో ఎర్ర బంగారం అమ్మకానికి తరలించిన రైతులు ఈ ధరలుచూసి దిగులు చెందుతున్మారు. 2022- 2023 వ్యవసాయ సీజన్ లో 11,38,837 క్వింటాల మిర్చి అమ్మకాలు జరిగాయి.. దేశీరకం మిర్చి క్వీoటా 81,000 రూపాయల ధర నమోదయింది.. 2021- 2022 వ్యవసాయ సీజన్ లో దేశంలోనే అత్యధిక ధర నమోదైంది.. దేశీరకం మిర్చి క్వింటా 96,000 రూపాయల రికార్డ్ ధర పలికింది..
ఈ ఏడాది దేశీరకం మిర్చి 32,000 రూపాయల అధిక ధరగా నమోదైంది.. ఒక్కసారిగా తగ్గిన ధరలు చూసి రైతులు నోరెళ్ళ బెడుతున్నారు. కనీస మద్దతు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఎర్ర బంగారం రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రస్తుతం తీసుకువస్తున్న మిర్చిలో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వ్యవసాయ మార్కెట్ అధికారులు అంటున్నారు.. దీనికి తోడు విదేశీ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో మిర్చి డిమాండ్ లేక పోవడం, ఎగుమతులు తగ్గిపోవడం కూడా మరో కారణం అంటున్నారు.. కారణాలు ఏమైనా రైతులు మాత్రం గుళ్ల అవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.