నిజాం కాలం నాటి చారిత్రక భవనం ఇప్పుడు ఓరుగల్లుకు ఐకాన్‌గా, హెరిటేజ్ బంగ్లాగా రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటివరకు కలెక్టర్ల క్యాంపు కార్యాలయంగా ఆశ్రయమిచ్చిన ఆ బంగ్లా, ఇక మీదట హెరిటేజ్ బంగ్లాగా చరిత్రలో నిలవబోతోంది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పురాతన భవనంలో ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు విడిది చేయడం ఓ చరిత్ర.. కానీ అప్పట్లో దెయ్యం భయంతో ఆ చారిత్రక భవనం చర్చగా మారింది..!
సుబేదార్ ప్రాంతంలోని ఈ బంగ్లాను 1886లో అప్పటి నిజాం పరిపాలన సమయంలో జార్జ్ పామర్ నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమమైన ఈ బంగ్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన నుండి ఇప్పటివరకు వరంగల్ కు వచ్చే ప్రతి కలెక్టర్ ఈ బంగ్లాలోనే అతిథి గృహంగా ఉపయోగించే వారు. 15 ఎకరాల విస్తీర్ణంలో, విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ చారిత్రక భవనానికి ఎంతో ప్రత్యేకత ఉంది.138 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక బంగ్లాలో ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు కుటుంబ సమేతంగా విడిది చేశారు. ఇక్కడి నుండే వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించారు.
తాజాగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కొత్త క్యాంపు కార్యాలయంలోకి షిఫ్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో 138 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన బంగ్లాను హెరిటేజ్ భవనంగా మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బంగ్లా అభివృద్ధి పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ “కుడా”కు అప్పగించారు. ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చాలని ఆదేశించారు.
సుబేదార్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే కనిపించే ఈ బంగ్లా ప్రధాన ద్వారం ఆకర్షణ కనిపిస్తుంది. దానిపై 138 సంవత్సరాల క్రితమే నిజాం కాలంలో అమర్చిన వాల్ క్లాక్ గంటగంటకు ఓరుగల్లు ప్రజలను అలారంతో అలర్ట్ చేస్తుంది.. 57 మంది కలెక్టర్లు విడిది చేసిన ఈ బంగ్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది.. ఎన్నెన్నో చేదు జ్ఞాపకాలు.. మధుర అనుభవాలు ఆ కలెక్టర్లు మూటకట్టుకుని వెళ్లారు. గతంలో ఒక దశలో కలెక్టర్ ఆమ్రపాలి కాటా ఇందులో దెయ్యాలు ఉన్నాయని భయాందోళన చెందడం అప్పుడు తీవ్ర చర్చగా మారింది. స్వయంగా కలెక్టర్ దెయ్యం అనుభవాలు మీడియాకు వెల్లడించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అలాంటి చారిత్రక భవనం ఇప్పుడు హెరిటేజ్ బంగ్లాగా, ఓరుగల్లుకు ఐకాన్ గా నిలువబోతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..