Kishan Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

|

Oct 20, 2024 | 1:02 PM

హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌తో కలిసి చర్లపల్లి స్టేషన్‌లో పర్యటించిన ఆయన.. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో రైల్వేలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కిషన్‌రెడ్డి.

Kishan Reddy: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy
Follow us on

చర్లపల్లిలో రూ.430 కోట్లు వ్యయంతో కొత్త రైల్వే టెర్మినల్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. ఇది ప్రారంభమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై భారం తగ్గుతుందని.. ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పనులు పూర్తి కాగానే ప్రధాని మోదీ చేతుల మీదుగా చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే యాదాద్రికి ఎంఎంటీఎస్‌ పనులు ప్రారంభిస్తామన్నారు కిషన్ రెడ్డి. కొమురవెల్లిలోనూ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతోందని.. ఇవి పూర్తయితే యాదాద్రితో పాటు కొమురవెల్లికి రైళ్లు ప్రారంభిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లి రూపొందుతోంది. సుమారు 430 కోట్లతో ఎయిర్‌పోర్టును మైమరపించేలా ఈ రైల్వే టెర్మినల్‌ను కేంద్రం అద్భుతంగా నిర్మించింది. ఇక.. చర్లపల్లిలో ఇప్పటికే ఐదు ప్లాట్ ఫామ్‌లు ఉండగా.. వీటికి అదనంగా మరో 4 ప్లాట్ ఫామ్‌లు రెడీ చేశారు. మొత్తం.. 9 ప్లాట్‌ఫామ్‌లు, 9 లిఫ్ట్‌లు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మితమైంది. దాదాపు పనులు పూర్తి కావడంతో త్వరలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాంతో.. వందేళ్ల తర్వాత హైదరాబాద్‌లో కొత్త అతిపెద్ద రైల్వేస్టేషన్‌ అందుబాటులోకి రానుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..