
టెక్నాలజీ మారుతున్నా.. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతూ పరుగులు పెడుతున్నా ఆదివాసీలు తమ మూలాలు, సాంప్రదాయాలను మర్చిపోరు. వాటిని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.. తమ జీవన విధానం భిన్నంగా ఉంటుంది..వారి ఆచారాలు, ఆహార అలవాట్లు ఇలా ప్రతిదీ ఇతరుల కంటే భిన్నంగానే ఉంటుంది.. పాశ్చాత్య పోకడలు తమపై పడి..ఎక్కడ తమ సాంప్రదాయాలు, కళలు, ఆచారాలు మరుగున పడకుండా ఉండేదుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఆధునిక పోకడల వల్ల తమ ప్రాచీన సంస్కృతి మరుగున పడకుండా ఉండేందుకు భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని ఆదివాసీలు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. మూల ఆదివాసీల సంక్షేమ సంఘం (మాస్) ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్‌ను పూర్తిగా నిషేధించారు.
నేటి కాలంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా, పండుగలు వచ్చినా డీజే సౌండ్ సిస్టమ్స్ పెట్టడం సర్వసాధారణంగా మారింది. అయితే, ఈ డీజేల హోరులో ఆదివాసీల సాంప్రదాయ సంగీతం, నృత్యాలు కొట్టుకుపోతున్నాయని ‘మాస్’ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆదివాసీ గ్రామాల్లో డీజే వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆంక్షలను ధిక్కరించి గ్రామాల్లో డీజే పెడితే ఏకంగా రూ. 2 లక్షల భారీ జరిమానా విధిస్తామని సంఘం హెచ్చరించింది.
ఇప్పటికే నిబంధనలను అతిక్రమించి, వేరే గ్రామానికి డీజే డ్యాన్సుల కోసం వెళ్లిన 30 మంది గిరిజన యువకులకు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున మొత్తం రూ. 60,000 జరిమానా విధించినట్లు మాస్ అధ్యక్షుడు మడకం చందు స్పష్టం చేశారు.
ఆగస్టు 9న రాబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏజెన్సీ వ్యాప్తంగా సరికొత్త హుకుం జారీ అయింది. ఆదివాసీ గ్రామాల్లో అడుగుపెడితే సంస్కృతి ఉట్టిపడేలా చేసేందుకు ఇంటికో డోలు కచ్చితంగా తయారు చేయాలని నిర్వాహకులు ఆదేశించారు. దీంతో ప్రస్తుతం గిరిజన గూడేలలో సాంప్రదాయ డోళ్ల తయారీ పనులు అత్యంత ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్కో డోలు తయారీకి దాదాపు రూ. 3,000 వరకు ఖర్చు అవుతున్నప్పటికీ, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి గిరిజనులు సంతోషంగా ముందుకు వస్తున్నారు.
డోళ్లతో పాటు ఆదివాసీల పండుగలు, నృత్యాలలో గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా కాళ్లకు ధరించే గిజ్జిల్లను కూడా ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ఆధునిక వినోద సాధనాల జోలికి వెళ్లకుండా, తమ పూర్వీకుల నాటి సంగీత వాయిద్యాలను రీ-కనెక్ట్ చేసుకుంటూ భద్రాచలం ఏజెన్సీ గిరిజనులు తీసుకున్న ఈ నిర్ణయం, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..