Tragedy : మంచిర్యాల జిల్లాలో విషాదం.. హైటెన్షన్ లైన్ తెగి పడటంతో ముప్పై గేదెలు మృతి.. తృటిలో భయటపడ్డ కాపరులు

|

Jun 27, 2021 | 2:18 PM

మంచిర్యాల జిల్లాలో కరెంట్ తీగలు యమపాశాలుగా మారాయి. జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో విద్యుత్‌ షాక్‌ గురై ఏకంగా 30 పశువులు మృతి చెందాయి...

Tragedy : మంచిర్యాల జిల్లాలో విషాదం.. హైటెన్షన్ లైన్ తెగి పడటంతో ముప్పై గేదెలు  మృతి..  తృటిలో భయటపడ్డ కాపరులు
Buffaloes Die
Follow us on

Thirty buffaloes die : మంచిర్యాల జిల్లాలో కరెంట్ తీగలు యమపాశాలుగా మారాయి. జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో విద్యుత్‌ షాక్‌ కు గురై ఏకంగా 30 పశువులు మృతి చెందాయి. గ్రామ పొలిమేరలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఇద్దరు పశువుల కాపరులు తృటిలో ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద సక్రమంగా లేని విద్యుత్ తీగలు, తెగిపడుతున్న విద్యుత్‌ లైన్లు ఉమ్మడి ఆదిలాబాద్ లో పశువుల పాలిట యమపాశాలవుతున్నాయి. ముఖ్యంగా ఏజేన్సీ ప్రాంతంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

జన్నారం , ఇంద్రవెళ్లి , బజార్ హత్నూర్ , నార్నూర్ , నెన్నెల పరిదిలో ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కాలం చెల్లిన విద్యుత్ తీగలను మార్చాల్సిన విద్యుత్‌ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవటం వర్షకాలం సీజన్ ప్రారంభం లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

నిత్యం ఎక్కడో ఓ చోట పశువుల ప్రాణాలు మింగేస్తున్నాయి. కిందికి వేలాడుతున్న వైర్లు , హఠాత్తుగా తెగిపడుతున్న కరెంట్ తీగలు పాడి రైతుల ను నిండా ముంచుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరెంట్ షాకులతో కేవలం ఆరు నెలల వ్యవదిలో 375 పశువులు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.

విద్యుత్‌ లైన్లకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్లలో అత్యధికం ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో చిన్నపాటి గాలులకు కూడా ఇవి తెగిపడి పశువులను ప్రాణాలను హరిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రిటన్‌ సప్లయ్‌ రావటం, తీగలకు వివిధ రకాల పిచ్చి చెట్లు అల్లుకొని ఉండటంతో ఎర్త్‌ తీగకు విద్యుత్‌ సరఫరా అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు సమయంలో నిర్దేశించిన లోతులో గుంతలు తీయకపోవడం.. అవి కాస్తంత ఎక్కువ గాలి వీస్తే నేలవాలుతుండటం ప్రమాదాలకు కారణం అవుతోంది.

ఇలా ఉండగా, విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన పశువుల పోషకులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం పశువుల యజమాని స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయాలి. వీఆర్వో విద్యుదాఘాతానికి మృతి చెందిన పశువుల వివరాలు, యజమాని పేరు, మృతి చెందిన పశువు విలువ, మరణానికి కారణలాంటి వివరాలతో తహసీల్దార్‌, మండల పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి.

పశువైద్యాధికారి మృతి చెందిన పశువులకు పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి డివిజన్‌ స్థాయిలో ట్రాన్స్‌కో ఏడీఈకి కానీ, సంబంధిత అధికారికి కానీ ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. పశుపోషకుడు కూడా విద్యుత్‌ శాఖ అధికారులకు ధరఖాస్తుతోపాటు ఎఫ్‌ఐఆర్‌ కాపీ, పోస్టుమార్టం నివేదిక జత చేసి అందజేయాలి. వారు పరిశీలించి ఉన్నతాధికారులకు పరిహారం కోసం నివేదించాలి. వారు సంస్ధ నుంచి రైతులకు పరిహారాన్ని మంజూరు చేయాల్సి ఉంది. ఇంత జరిగితే తప్ప పశు యజమానికి పరిహారం అందదు.

Line Breaks

Read also : CPI Narayana : నా సలహా ఏంటంటే.. ‘కొత్తగా పెళ్లైన వాళ్లకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేయించండి’ : నారాయణ