ఏవండోయ్ ఆవిడ వచ్చింది విత్ ప్రూఫ్స్‌తో.. ఏవండోయ్ ఆమె మాట్లాడింది విత్ డాక్యుమెంట్స్‌తో.. ఏవండోయ్ ఆవిడ ఏడ్చింది.. వితౌట్ గ్లిజరిన్‌తో.. ఏవండోయ్ ఆవిడ చాలెంజ్ విసిరింది.. వితౌట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. ఏవండోయ్.. ఇక ముందుకూడా ఇలాగే ఆవిడ ఉంటారట.. ఇలాగే చేస్తారట.. ఎవడాపుతాడో చూడాలట.. ఇది కరాటే కళ్యాణి(Karate Kalyani) ఓ యూట్యూబర్(youtuber) శ్రీకాంత్ రెడ్డి గూబ గుయ్ మనిపించిన తర్వాత జరిగిన తాజా స్టోరీ ఇది. అయితే ఇక అసలు కథలోకి వెళ్దాం. బిగ్ బాస్ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కరాటే కళ్యాణి.. హిందూ పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. లేటెస్ట్‌గా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి చెంప చెళ్లుమనించిన తర్వాత వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీకాంత్ రెడ్డితో మొదలైన వివాదం నెమ్మదిగా ఆమె చుట్టూ చేరింది.
శ్రీకాంత్ రెడ్డి ఎవరు..?
సోషల్ మీడియాలో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రాంక్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, మహిళల దగ్గరకు వెళ్లి వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడుతూ వాళ్లని ఫ్లర్ట్ చేసి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ యూట్యూబర్ గా మారాడు. గత కొన్నేళ్లుగా శ్రీకాంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో వల్గర్ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఆంటీలు, అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. వాళ్లతో సెక్స్ గురించి మాట్లాడటం.. పిచ్చి. పచ్చి బూతులు మాట్లాడి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు శ్రీకాంత్ రెడ్డి.
కరాటే కళ్యాణికి ఎందుకు కోపం వచ్చింది..
శ్రీకాంత్ రెడ్డి యూట్యూబర్. వీడియోల పేరుతో మహిళలతో అసభ్య కరంగా ప్రవర్తించడమే అతడి నైజం. ఈ దారుణమైన వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. ఈ వీడియో స్టార్ హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో కరాటే కళ్యాణికి కనిపించాడు అంతే శ్రీకాంత్ రెడ్డిని గుడ్డలూడదీసి కొట్టింది కరాటే కళ్యాణి. కరాటే కళ్యాణి నివాసం ఉండే ఏరియాలోనే శ్రీకాంత్ రెడ్డి కూడా ఉంటాడు. గురువారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని నిలదీసింది. ఫ్రాంక్ వీడియోలు తీస్తుండగా.. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించిన కరాటే కళ్యాణి అతని గుబ్ గుయ్‌మనిపించింది. నువ్వు తీస్తున్న వీడియోలతో సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అంటూ చెంపపై కొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ రెడ్డి చొక్కా పెట్టుకుని కొట్టడంతో గొడవ పెద్దదైంది. ‘నువ్ తీస్తున్న ఫ్రాంక్ వీడియోలు ఏంటి.. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్..? అంటూ అతన్ని చెంప పగులగొట్టింది. ఆమె అనుచరులు కూడా ఒక్కసారిగా దాడి చేయడంతో శ్రీకాంత్ రెడ్డి తిరగబడ్డాడు.
కరాటే కళ్యాణితో పాటు.. తనని కొట్టిన వ్యక్తిపై తిరిగి దాడి చేశాడు శ్రీకాంత్ రెడ్డి. ఈ గొడవలో కరాటే కళ్యాణి చెంప పగలగేలా కొట్టాడు. ఈ కొట్లాటలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది. ఆ తరువాత మళ్లీ లేచి.. శ్రీకాంత్ రెడ్డిని వెంబడించి గుడ్డలు ఊడేట్టుగా కొట్టింది కరాటే కళ్యాణి. తనపై దాడితో శ్రీకాంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. ఎందుకు కొట్టావ్ అంటూ తిరగబడ్డాడు. ప్రాంక్ చేస్తే తప్పేంటి అంటూ దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ టు మధురానగర్ వరకు జరిగిన ఈ గొడవ రచ్చ క్రియేట్ చేసింది.
ఇలాంటి ప్రాంక్‌ల పేరుతో మహిళలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నాడని.. ఎక్కడ బడితే అక్కడ చేతులేస్తూ.. అడల్ట్ కంటెంట్ వీడియోలతో పబ్బం గడుపుకుంటున్నాడని.. అతనిపై చర్యలు తీసుకోవాలని కళ్యాణి డిమాండ్ చేసింది.
ఆ తర్వాత రోజు సీన్ మారింది..
రెండో రోజు కరాటే కల్యాణి చిక్కుల్లో పడ్డారు. గొడవ వ్యవహారం పక్కకు వెళ్లిపోయింది. ఆమె చేతిలో ఉన్న చిన్నారిని ఇటీవల దత్తతకు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ దత్తతకు ఎలాంటి చట్టబద్దత లేదని ఫిర్యాదులు అందాయి. చట్టవిరుద్ధంగా ఆమె చిన్నారులను దత్తతకు తీసుకున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు వరుసగా ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. దత్తత వివరాలు ఆరాతీశారు. అయితే అధికారులు కరాటేకల్యాణి ఇంటికి వెళ్లిన సమయంలో ఆమె లేరు.
దత్తత వివరాలను అడిగి తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు.. కరాటే కల్యాణి దగ్గర ఇంకా ఎంతమంది దత్తతకు తీసుకున్న పిల్లలున్నారన్న వివరాలు ఆరా తీశారు. ఆమె దగ్గర 12 ఏళ్ల బాలుడు, 6 నెలల చిన్నారి ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. అయితే దత్తతకు సంబంధించి.. వారి తల్లిదండ్రుల దగ్గర అన్నిరకాల సంతకాలు తీసుకున్నట్లు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లకు వివరించారు. కల్యాణి ఇంట్లో నోటీసులు ఇచ్చారు అధికారులు. రెండ్రోజుల్లో తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు.
అయితేదత్తత విషయంలో తమ కూతురు ఏ తప్పు చేయలేదంటున్నారు కల్యాణి తల్లి. తమ కూతురు ఎలాంటి తప్పు చేయలేదని.. ఆమెకు సామాజిక సేవ అంటే ఇష్టమని.. అందుకే అనాథలను, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరిస్తుందని చెబుతున్నారు.
24 గంటల హైడ్రామా తర్వాత..(మూడో రోజు)
పాపతో ఎక్కడికి వెళ్లిందనే టెన్షన్ తర్వాత సోమవారం సాయంత్రం అజ్ఞాతమైతే వీడారు.. నా తప్పు ఏమున్నదబ్బా.. అంటూ పాప తల్లిందడ్రలతో సహా కళ్యాణి ప్రత్యక్షమైంది. మరి కరాటే కళ్యాణి ఎపిసోడ్‌లో ఇవాళ ఏం జరగబోతోంది? విచారణలో ఏం చెప్పబోతున్నారు? అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది వెయిట్ అండ్ సీ.
కరాటే కళ్యాణి పారిపోయిందని.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని.. కిడ్నాప్ అయిందని ప్రచారం.. అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకుందని ఆరోపణలు.. వీటన్నిటికీ తెరదించుతూ.. సోమవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానం ఇచ్చారు కరాటే కళ్యాణి.
తాను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే టైప్ అన్నారు. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదనీ.. పాపను అసలు దత్తతే తీసుకోలేదంటున్నారు కరాటే కళ్యాణి. చిన్నారి తల్లిదండ్రుల ఇష్టంతోనే తాను పాపను పెంచుకుంటున్నట్ట్టు చెప్తున్నారు. కొన్ని నెలల తర్వాత అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నట్టు మీడియాకు స్పష్టం చేశారు. ఆధారాలతో సహా రావాలనే ఉద్ధేశంతోనే 24 గంటల పాటు కనిపించకుండా పోయానంటున్నారు కరాటే కళ్యాణి. పాప తల్లిదండ్రలతో సహా ఇవాళ కలెక్టర్ దగ్గరకు వెళ్తానంటూ క్లారిటీ ఇచ్చారామె.
శివశక్తి సభ్యులే తన వెనుక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కరాటే కళ్యాణి. వాళ్ల ఆదాయంపై దెబ్బ కొట్టినందుకే తనపై కక్ష గట్టారనేది ఆమె వాదన. పిల్లలను డబ్బులకు అమ్ముకుంటున్నట్టు.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిచారామె. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి నిందలు వేయడం బాధ కలిగించిందన్నారు.
సోమవారం రాత్రి ప్రెస్ మీట్ జరుగుతుండగానే చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో పాటు పోలీసులు అక్కడికి వచ్చారు. ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నారు. కాసేపట్లో ఆమె విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆమె ఏం చెప్తారు? ఆ తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటానేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇప్పుడీ రచ్చతో ప్రాంక్ వీడియోలు పబ్లిక్ లైఫ్‌ను ఎంత డిస్ట్రబ్ చేస్తున్నాయో కళ్లకు కడుతున్నాయి. ప్రాంక్ వీడియోలతో సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయ్. శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లు ప్రాంక్ వీడియోల పేరుతో లేడీస్‌తో ఎంత వల్గర్‌గా బిహేవ్ చేస్తారో…అతని పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. వీటి వల్ల ఒక్కరూపాయి ఉపయోగం ఈ సమాజానికి ఉందా.. అంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రజాసంఘాలు. ప్రాంక్‌ల పేరుతో పిచ్చి పిచ్చివేషాలు వేసే ఇలాంటి వాళ్లను యూట్యూబ్ నుంచే కాదు…కఠిన చర్యలు తీసుకుని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.