తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కొందరు వ్యక్తులు శాంతి భద్రతలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం అన్నారు. ఇటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయాలని, రాజకీయ లబ్ధి పొందేందుకు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.కౌశిక్ రెడ్డి వర్సస్ అరికెపూడి గాంధీ ఎపిసోడ్‌తో హైదరాబాద్‌లో గురువారం అర్థరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ జితేందర్‌కి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సీఎం రేవంత్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడం అనేది ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డీజీపీని ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలు దెబ్బతినకుండా కాపాడాలని, ప్రతిపక్షాలకు సంబంధించిన ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
డీజీపీకి సీఎం సూచనలు
ఈ రోజు మధ్యాహ్నం డీజీపీ పోలీస్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి, పోలీస్ యంత్రాంగానికి పలు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం. శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందని, చిన్నపాటి సంఘటనలకు కూడా తగిన సమాధానం ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా కాపాడాలి
సీఎం రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్‌ను, శాంతియుతంగా మరియు అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎవరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేసినా, వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, కొన్ని పార్టీల కుట్రలకు పాల్పడే ప్రయత్నాలు రాష్ట్ర శాంతి భద్రతల కోసం ముప్పుగా మారుతున్నాయని సీఎం పేర్కొన్నారు.
తాజా పరిస్థితులపై డీజీపీ రివ్యూ..
ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్, తెలంగాణలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఎంత మాత్రం సహించబోమన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని డిజిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులకు సహకరించాలని, తెలంగాణ పోలీసుల ప్రతిష్టను, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలని డిజిపి కోరారు