Sep 17th: తెలంగాణా విమోచనోద్యమ వీరుల త్యాగ ఫలం.. ఎగిసింది పరకాల అమరధామం..

Telangana Liberation Day: స్వేచ్చా స్వాతంత్ర్యం కోరుతూ, బానిస బతుకుల నుంచి విముక్తి కోసం తిరగబడ్డ పోరుగడ్డ, రజాకార్ల గుండెల్లో పిరంగులై పేలిన యోధులకు పురుడు పోసిన పుణ్యభూమి ఓరుగల్లు. తాడిత, పీడిత జనం కోసం జరిగిన సమరంలో రాక్షస రజాకార్లు మరుభూమిగా మార్చిన మరో జలియన్ వాలాబాగ్ పరకాల రక్త చరిత్ర. నైజాం చీకటి రాజ్యానికి సజీవ సాక్ష్యం.

Sep 17th: తెలంగాణా విమోచనోద్యమ వీరుల త్యాగ ఫలం.. ఎగిసింది పరకాల అమరధామం..
Parakala Amaradamam

Updated on: Sep 13, 2022 | 2:17 PM

సెప్టెంబర్‌ 17.. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, స్వేచ్ఛా వాయువులు నింపిన రోజు. భారతదేశానికి 1947 అగస్టు 15న స్వాతంత్రం లభించింది. నిజామ్‌ ఏలుబడిలో ఉన్న తెలంగాణ-13నెలల తర్వాత సెప్టెంబర్‌ 17, 1948న స్వాతంత్ర్యం పొందింది. ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం వందలాది మంది తెలంగాణ పోరాటయోధులు అసువులు బాశారు. నాటి రజాకార్ల దాష్టికాలకు ప్రత్యక్షసాక్ష్యం వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామం. రజాకార్ల నరమేధానికి సాక్షిగా పరకాలలో రక్తపుటేరులు పారాయి. ఆ ఘటన మరో జలియాన్‌ వాలాబాగ్‌ను గుర్తుకు తెస్తుంది. 1947 సెప్టెంబర్ 2న పరకాల పట్టణం రణరంగంగా మారింది.

హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయజెండా పట్టుకొని పరకాలలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యమకారులపై అప్పటి నిజాం రాకాసి మూకలు తుపాకీగుళ్ళ వర్షం కురిపించాయి. పరకాలలోని చాపలబండ నుంచి ఊరేగింపుగా బయలుదేరిన ఉద్యమకారులు హిందూస్థాన్ జిందాబాద్, వందేమాతరం అంటూ నినాదాలు చేసుకుంటూ ఉప్పెనలా బయలుదేరారు..

ఈ క్రమంలో అప్పటి పరకాల పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జియాఉల్లా, మేజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావు మూడు లారీల పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకీగుళ్ల వర్షం కురింపిచారు. నాటి ఘటనలో 21 మంది అక్కడికక్కడే కన్నుమూత. ఒకవైపు పోలీసులు, మరోవైపు రజాకార్ల తుపాకులు, బరిసెలు జనం మీద విరుచుకుపడ్డాయి. ఈ సంఘటనలో 21 మంది అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వందల మంది గాయపడ్డారు. ఆనాటి నెత్తుటి సాక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం పరకాలలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ అమరధామం.

బాంచన్ నీ కాల్మొక్తా అంటూ బతికిన బడుగు జీవులే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించిన మహత్తర పోరాట చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానిది. సామాన్యులను సాయుధులను చేసిన ఉద్యమమిది. ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు అప్పటి కేంద్ర హోంశాఖ సహయ మంత్రి Ch. విద్యాసాగర్ రావు సెప్టెంబర్‌ 17, 2003న చాపలబండ సమీపంలో రజాకారులకు చేతిలో బలైన అమరుల త్యాగాల గుర్తుగా అమరధామం నిర్మాణానికి పూనుకున్నారు. 270 రోజులలో 50 లక్షల రూపాయలతో ఈ స్మృతి చిహ్నాన్ని పూర్తి చేశారు.

అమరథామం మెయింటెనెన్స్ చూస్తున్న పరకాల మున్సిపాలిటీ నాటి ఘటనకు సజీవ సాక్ష్యాలు ఈ అమరధామం శిల్పాలు. ప్రస్తుతం దీని నిర్వహణ బాధ్యత పరకాల మున్సిపాలిటీ చూస్తోంది. నాటి స్వతంత్ర ఉద్యమాన్ని కళ్లారా చూసిన వారు, నాటి అకృత్యల గురించి అనాటి పెద్దల నుంచి విన్నవారు ఇప్పటికి చెమ్మగిల్లిన కళ్ళతో ఆనాటి చేదుజ్ఞాపకాలు నెమరవేసుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం