టీపీసీసీ చీఫ్‌గా అనుముల రేవంత్ రెడ్డి పేరును జూన్, 2021లో హైకమాండ్ అనౌన్స్ చేసిన సందర్భంలో కాంగ్రెస్‌పార్టీలో జరిగిన హైడ్రామా ఇప్పటికీ తెలుగు ప్రజలు మదినుంచి చెరిగిపోలేదు. సీనియర్స్ అంతా రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా వద్దని వ్యతిరేకించినా హైకమాండ్ వినలేదు. అక్కడ్నుంచే కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు మరింత పదునెక్కాయి. ఒరిజినల్ కాంగ్రెస్.. డూప్లికేట్ కాంగ్రెస్ అంటూ రెండు గ్రూపులు తెరపైకొచ్చాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఓ సెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించేవారు. అడ్డుకునేవారు. పార్టీ మీటింగ్‌లకు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ పిలిచినా కొందరు వచ్చేవారు కాదు. ఇంకొందరు గాంధీభవన్ గడప తొక్కమని శపథాలు కూడా చేశారు. మరికొందరు బహిరంగంగానే విమర్శలతో విరుచుకుపడిన సందర్భాలు కోకొల్లలు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అసమ్మతులకు, వర్గాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నాలు చేసిన రేవంత్, అటు అధిష్టానానికి కూడా చేరువయ్యారు.
అసలు ఈరేంజ్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఏడాది కిందట ఏ రాజకీయ పార్టీ.. ఏ లీడరూ.. అంతెందుకు కాంగ్రెస్ నేతలే ఊహించలేదు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ శకం ముగిసిందని ఎన్ని జాకీలు పెట్టినా లేవదంటూ ఎద్దేవా చేశారు ప్రత్యర్ధులు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ అద్భుతమైన ఫలితాలు రాబట్టడంతో ఈసారి గులాబీ దండుకు గట్టిపోటీ ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయినా టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఏ దశలోనూ నిరుత్సాహ పడలేదు. ఓవైపు సొంత పార్టీ నుంచి తగులుతున్న రాళ్లు..మరోవైపు పార్టీని బలోపేతం చేసేందకు ఎదురయ్యే అడ్డంకులు ఇలా ప్రతి సమస్యను సమయస్పూర్తితో హ్యాండిల్ చేశారంటారు విశ్లేషకులు.
ఓ రకంగా కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు డబుల్ బూస్టప్‌నిచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడి మార్పు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. అటు హైకమాండ్ కూడా కర్ణాటక తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. ఆపార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సమయంలో రేవంత్ వారి వెంట ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. మరోవైపు పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సీనియర్ నేతల నుంచి విమర్శలు వస్తున్నా తనదైన శైలిలో పని చేసుకుపోతున్నారన్న పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి.
అలా ఒక్కో సమస్యను అధిగమిస్తూ..హైకమాండ్‌కు మరింత దగ్గరై.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాగల వ్యక్తి అన్న స్థాయికి పార్టీలో రేవంత్ ప్రాబల్యం పెరిగింది. పార్టీలోకి వచ్చిన కొత్తలోనే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్ధినేనంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రేవంత్, ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తన మనోభావాన్ని ప్రజల ముందుంచారు.
ఈ ఎన్నికల ప్రచారంలో కూడా కొంత సెంటిమెంట్‌ను రగిలించి చేసిన రేవంత్‌రెడ్డి స్పీచ్‌లు కూడా ప్రజల్లో తనపై అటెన్షన్ను పెంచింది. అలాగే సొంతపార్టీలోని అగ్రనేతలు రేవంత్ టార్గెట్‌గా కామెంట్స్ చేయడం.. ఇటు ప్రత్యర్ధులు కూడా టీపీసీసీ చీఫ్‌నే లక్ష్యంగా చేసుకోవడంతో రాజకీయంగా రేవంత్‌పై మరింత ఫోకస్ పెంచేలా చేసింది. మీవాడు రాష్ట్రానికి నాయకత్వం వహించేందుకు సహకరించాలి అంటూ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ ఇచ్చిన పిలుపు కూడా ప్రజల్లోకి బాగా వెళ్లింది.
తెలంగాణ ఉద్యమం నుంచే కేసీఆర్ పైనా ఆయన కుటుంబం పైనా తీవ్రపదజాలంతో విరుచుకుపడే నేతగా రేవంత్ రెడ్డికి పేరుంది. అసెంబ్లీలో గవర్నర్‌పై కాగితాలు విసిరేయడం లాంటి పనులు చేసినా అప్పట్లో ఆయనకు సమైక్యవాదుల్లో గ్లామర్ సంపాదించి పెట్టింది కేసీఆర్‌పై వ్యతిరేకతే. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ వ్యతిరేకుల జాబితాలో మొదటి పేరు రేవంత్‌దే. కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబం సభ్యులపై పరిధులు దాటి రేవంత్ తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. తాజా ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధిపతికి తానే సరిజోడు అనిపించుకునేందుకు కామారెడ్డిలో కేసీఆర్‌పై స్వయంగా పోటీ చేశారన్నది రాజకీయంగా వినిపించే మాట.
ఇలా కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ నుంచి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదిగేలా రాజకీయాల్లో వందకు వందశాతం సక్సెస్ అయ్యారు రేవంత్. అయితే రేవంత్‌రెడ్డికి సీఎం పోస్టు ఇస్తే ఏం అనుభవం ఉందన్న విమర్శలకు రేవంత్ తనదైనశైలిలో ఆన్సర్ ఇస్తున్నారు. టీవీ9 ప్రతిష్డాత్మకంగా నిర్వహించిన పొలిటికల్ కాన్‌క్లేవ్‌లో సీఎంగా మీ అనుభవం ఏంటి అన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రశ్నకు రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఆన్సరిచ్చారు.
ఇలా పార్టీలో ఉన్న సమస్యలన్నింటిని ఒకొక్కటిగా పరిష్కరించారు. అలిగిన నాయకుల్ని, అసంతృప్తితో ఉన్న సీనియర్లను కలిసి ఏక తాటిపైకి తెచ్చారు. అందర్నీ ఏకం చేసి.. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. కానీ ఇల్లు అలకగానే పండుగ కాదు.. అధికారంలోకి రాగానే గెలిచినట్టు కాదు. రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే మాట..
ఇప్పటిదాకా రేవంత్‌రెడ్డి రాజకీయం ఓలెక్కయితే..ఇప్పట్నుంచి మరోలెక్క. సీఎంగా ఎలాంటి మార్క్ చూపిస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరు గ్యారంటీలతో రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి కాంగ్రెస్ తీసుకొస్తుందన్న విమర్శలకు దీటుగా పాలన సాగించాలి. మరి చూడాలి..పార్టీని గెలిచి…రాష్ట్రాన్ని గెలిచిన రేవంత్‌రెడ్డి..పాలనలోనూ గెలిచి తెలంగాణ సమాజం నుంచి శెభాష్ అనిపించుకుంటారా..లేదా అన్నది.. వేచి చూడాల్సిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..