Suryapet: నామినేషన్‌ ఉపసంహరించుకున్న పటేల్‌ రమేష్‌ రెడ్డి

|

Nov 15, 2023 | 4:10 PM

సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌రెడ్డితో కాంగ్రెస్‌ చర్చలు సఫలం అయ్యాయి. హైకమాండ్‌తో పాటు రాష్ట్ర పెద్దల బుజ్జగింపుతో రమేష్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రమేష్ రెడ్డికి ఎంపీ సీటు ఇస్తామని హామి ఇచ్చినట్లు సమాచారం.

Suryapet: నామినేషన్‌ ఉపసంహరించుకున్న పటేల్‌ రమేష్‌ రెడ్డి
Patel Ramesh Reddy
Follow us on

సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి నివాసం దగ్గర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ ఉపసంహణకు గడువు సమీపిస్తుండటంతో రమేష్‌ రెడ్డిని బుజ్జగించేందుకు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి ఆయన ఇంటికి వెళ్లారు. రమేష్‌తో మాట్లాడిన అనంతరం బయటకు వచ్చిన మల్లురవితో పటేల్ అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఓ దశలో సహనం కోల్పోయి దాడి చేసేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

పరిస్థితి చేజారుతుండటంతో అలర్టయిన పోలీసులు పటేల్ అనుచరులను అడ్డుకున్నారు. రమేష్‌ రెడ్డితో అన్ని విషయాలు మాట్లాడామని.. ఎంపీగా అవకాశం కల్పిస్తామన్న అధిష్టానం ఆదేశాలను రమేష్‌కు వివరించామన్నారు మల్లు రవి.

ఓ వైపు బుజ్జగింపులు.. మరోవైపు అనుచరుల ఆందోళనల మధ్య.. నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు రమేష్‌ రెడ్డి. కాంగ్రెస్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ఎంపీ సీటు ఇస్తామన్న ప్రకటనతో రమేష్ నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు.

నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు

రాష్ట్రవ్యాప్తంగా 2898 నామినేషన్లను ఈసీ ఆమోదించింది. అత్యధికంగా గజ్వేల్‌ బరిలో 86 మంది అభ్యర్థులు నిలవగా.. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. చాలా చోట్ల రెబల్స్ పోటీలో దిగడంతో ఆయా పార్టీల నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ బుజ్జగింపులతో పలువురు వెనక్కి తగ్గారు. బరిలో నుంచి తప్పుకున్న నేతలకు పార్టీలో పదవులు లేదంటే ప్రభుత్వం వస్తే అధికారిక పదవులు ఇస్తామని పార్టీలు హామీలిచ్చాయి.

ఇక డోర్నకల్‌లో కాంగ్రెస్ రెబల్‌గా నెహ్రూ నాయక్ బరిలోకి దిగారు. ఆయన పోటీలో ఉండే పార్టీ ఓట్లు చీలిపోతాయని భావించి చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారు.

బాన్సువాడలో టికెట్‌పై కాసుల బాలరాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నా టికెట్ రాకపోవడంతో.. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. చికిత్స తర్వాత కోలుకున్న బాలరాజు.. రెబల్‌గా నామినేషన్ వేశారు. అయితే పార్టీ బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. ఈయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని పార్టీ హామీ ఇచ్చింది.

జుక్కల్‌లో రెబల్‌గా నామినేషన్ వేసిన గంగారాంకి సైతం ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది అధిష్టానం. దీంతో ఆయన కూడా పోటీ నుంచి విరమించుకున్నారు.
ఇక వరంగల్‌ వెస్ట్‌లో జంగా రాఘవరెడ్డి కూడా రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అది పార్టీపై ప్రభావం చూపుతుందని గ్రహించిన పార్టీ పెద్దలు.. బుజ్జగించారు. ఎమ్మెల్సీ లేదంటే డీసీసీ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.

వీళ్లే కాకుండా పినపాక, వైరా సహా పలు నియోజకవర్గాల్లోనూ రెబల్స్‌ను బుజ్జగించడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వ్యక్తులతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులను కూడా కొంత మందిని పోటీ నుంచి తప్పించింది కాంగ్రెస్. అయితే ఆదిలాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదు.

ఆదిలాబాద్‌లో సంజీవరెడ్డి రెబల్‌గా నామినేషన్ వేశారు. ఆయనకు పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత,
డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మద్దతు ఉంది. దీంతో సంజీవరెడ్డితో నామినేషన్ విత్ డ్రా చేయించాలనే ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా కంది శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి