AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైన చిలుక జ్యోష్యం! తాయత్తు నుంచి వైన్స్‌ వరకు సాగిన పంచాయితీ

హనుమకొండ జిల్లాలో చిలక జ్యోతిష్యం చెబుతున్న సమయంలో టైరు పేలుడుతో చిలక పారిపోయింది. దీంతో జ్యోతిష్యుడు, బైక్ మెకానిక్ మధ్య గొడవ జరిగింది. చిలక తిరిగి రానందున జ్యోతిష్యుడు మెకానిక్‌పై తప్పు పడుతున్నాడు. పంచాయతీ వరకు వెళ్ళిన ఈ వివాదంలో చిలుక ఇప్పటికీ కనిపించలేదు.

ఇద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైన చిలుక జ్యోష్యం! తాయత్తు నుంచి వైన్స్‌ వరకు సాగిన పంచాయితీ
Parrot Astrology
G Peddeesh Kumar
| Edited By: SN Pasha|

Updated on: Apr 19, 2025 | 4:05 PM

Share

చిలక జ్యోతిష్యం చెబుతుండగా పక్కనే బైక్‌ టైరు పేలింది. ఆ పేలుడు శబ్దానికి చిలక భయపడి ఎగిరిపోయింది. చిలక ఎగిరి పోవడంతో చిలుక జోతిష్యం చెప్పే వ్యక్తికి టైర్ పంచర్ షాప్ యజమానికి మధ్య పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది. చిలక తెచ్చిన చిక్కు చివరకు తన్నుకునేదాకా వచ్చింది. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్‌ క్రాస్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. దాస్‌ అనే ఓ బైక్‌ మెకానిక్‌ దుకాణం వద్దకు రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలుక జోస్యం చెబుతానని వచ్చాడు. దాస్‌ జోస్యం చెప్పించుకోవడానికి ఒప్పు కోవటంతో, చిలుక తీసిన బొమ్మను చూసి జ్యోతిష్యుడు రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని చెప్పాడు.

అయితే తనకు గిరాకీ కాలేదని, తర్వాత రావాలని దాస్‌ చెప్పి జ్యోతిష్యుడిని పంపించేశాడు. ఆ జ్యోతిష్యుడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ టైర్ పంచర్ షాప్ యజమాని దాస్ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్‌ చెప్పాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలుస్తూన్నాడు. చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్‌ టైరు పేలటంతో, ఆ శబ్దానికి భయపడి అది తుర్రుమని ఎగిరి సెల్‌ టవర్‌పైకి వెళ్లి వాలింది. జోతిష్యం చెప్పే చిలుక ఎగిరి పోయిందని జ్యోతిష్యుడిని దాస్‌ నిద్ర లేపడంతో అతడు ఒక్కసారిగా లేచి సెల్‌ టవర్‌ వద్దకు పరుగెత్తాడు.

కానీ మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు. జ్యోతిష్యుడి బాధ చూడలేక దాస్‌ అతడిని ఓ వైన్స్‌ వద్దకు తీసుకెళ్లి రూ.500తో మద్యం కొనిచ్చాడు. అయితే, తన చిలుకను దాస్‌ మాయం చేశాడని అతడి ఇంటికి వెళ్లి జ్యోతిష్యుడు గొడవ చేశాడు. ఇద్దరి మధ్య చిలక పంచాయతీ పెద్దల వద్దకు వెళ్ళింది. కొంతమంది స్థానిక పెద్దలు కలుగజేసుకొని చిలక పంచాయితీ తెంచే ప్రయత్నం చేశారు. కానీ ఆ జ్యోతిష్యుడు మాత్రం తన చిలుక తన కావాలని పట్టుబట్టడంతో చిలుక పంచాయితీ ఎటూ తెగకుండా పోయింది. పెద్దలంతా నీ చిలుక నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం అని జ్యోతిష్యుడికి నచ్చజెప్పి పంపించేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.