AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాహితతో అఫైర్‌.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి మైనర్ బాలుడి హత్య..!

ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని స్నేహితుడు బయటపెడతాడనే భయంతో ఓ మైనర్ బాలుడు మరో మైనర్ బాలుడికి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడు వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో కుట్రకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాహితతో పాటు మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాలు తెలుసుకుందాం..

వివాహితతో అఫైర్‌.. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి మైనర్ బాలుడి హత్య..!
Minor Boy Dies After Drinking Poisoned Cold Drink
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 12:19 PM

Share

ఖమ్మం, నవంబర్ 10: ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని స్నేహితుడు బయటపెడతాడనే భయంతో ఓ మైనర్ బాలుడిని మరో మైనర్ బాలుడు హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ హత్యకు ఓ వివాహిత కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అసలు ఏం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు స్నేహితులు. వీరిలో ఒకరు సత్తుపల్లిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతుండగా, మరో బాలుడు స్వగ్రామంలోనే పదో తరగతి చదువుతున్నాడు. గురుకులంలో చదువుతున్న బాలుడు దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చాడు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన ఇరుగు అపర్ణ (20) తన పెద్దమ్మ ఊరైన కల్లూరు మండలంలోని గ్రామానికి వచ్చింది. ఆమెకు ఏడాది క్రితం వివాహం కాగా, గత ఆరు నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఒకరోజు వివాహిత అపర్ణ, పదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడు ఒకే గదిలో సన్నిహితంగా ఉండటాన్ని గురుకులంలో చదువుతున్న మరో బాలుడు ప్రత్యక్షంగా చూశాడు. ఈ విషయం బయటపడితే తమ వ్యవహారం అందరికీ తెలిసిపోతుందని ఇద్దరూ ఆందోళనకు గురయ్యారు. దీంతో సదరు బాలుడిని అంతమొందించాలని వివాహిత, మరో మైనర్ బాలుడు కలిసి పథకం వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కుట్రలో భాగంగా అక్టోబర్ 21న నిందితుడైన మైనర్ బాలుడు తన స్నేహితుడిని వెంట తీసుకెళ్లాడు. ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి అతడికి తాగించాడు. అది తాగిన కొద్దిసేపటికే బాధితుడికి గొంతులో మంట రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఇంటికి వెళ్లిన బాలుడు జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆదివారం చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మృతుడి మేనత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నిందితులుగా ఉన్న మైనర్ బాలుడిని, వివాహిత అపర్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడైన మైనర్ బాలుడిని వరంగల్ బాలల జైలుకు, వివాహితను సత్తుపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన వయసులో ఓ బాలుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మరోవైపు, చదువుకోవాల్సిన వయసులో నేరానికి పాల్పడిన బాలుడు కూడా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటున్నాడు. చిన్న వయసులోనే తప్పుడు నిర్ణయాలు, ఆవేశపూరిత చర్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. పిల్లల ప్రవర్తన, స్నేహాలు, మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం ఎంతో అవసరం.

Follow Us