తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిగ్ ఫైట్ నెలకొంటున్న నియోజకవర్గాల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం (Medak Assembly Election) ఒకటి. ఇక్కడ పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు మధ్య హోరీహోరీ పోరు నెలకొంది.. మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాల్లోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ గెలుపొందారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై.. రోహిత్ గెలుపొందారు. పద్మాదేవేందర్ రెడ్డిపై 9, 238 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ నియోజకవర్గ పరిధిలో మెదక్, పాపన్నపేట, రామాయంపేట, శంకరంపేట్ మండలాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉన్నారు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 85.32 శాతం ఓటింగ్ నమోదయ్యింది. తెలంగాణ అసెంబ్లీ తొలి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఆమె విజయం సాధించగా.. తాజాగా.. ఎన్నికల్లో రోహిత్ కాంగ్రెస్ జెండా ఎగురేశారు.
1957 నుంచి ఇప్పటివరకు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాలనికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు, సీపీఐ ఒక్కసారి విజయం సాధించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి ఇక్కడి నుంచి 39,600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పద్మా దేవేందర్ రెడ్డికి 89,654 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతికి 50,054 ఓట్లు దక్కాయి. 2018 ఎన్నికల్లో వరుసగా రెండోసారి పద్మా దేవేందర్ రెడ్డి ఇక్కడి నుంచి 47,983 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాటి ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డికి 97,670 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డికి 49,687 ఓట్లు దక్కాయి.
ఈ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బరిలో నిలిచారు. హ్యాట్రిక్ విజయంపై ఆమె కన్నేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ రావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందగా… బీజేపీ నుంచి పంజా విజయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంతరావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ టికెట్‌తో తన తనయుడిని మెదక్ నుంచి ఎన్నికల అరంగేట్రం చేయించాలని మైనంపల్లి ఉవ్విళ్లూరారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం తన తనయుడికి మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మైనంపల్లి తండ్రీతనయుడు కాంగ్రెస్‌లో చేరి ఇద్దరికీ టికెట్ సాధించారు.
మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న మైనంపల్లి.. మెదక్ నుంచి తన తనయుడిని గెలిపించుకోవాలని పట్టుదలతో పనిచేసి గెలిపించుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్