AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పట్టాలపై ఆస్పత్రి.. బోగీలే ఆపరేషన్ థియేటర్లు.. వైద్యం ఉచితం !

పేదలు, గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రపంచంలోనే తొలి ఆస్పత్రి రైలుగా గుర్తింపు పొందిన లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చేరుకుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు కంటి, దంత, చెవి, ఎముకల సమస్యలతో పాటు పలు అనారోగ్యాలకు వైద్య పరీక్షలు, అవసరమైన శస్త్రచికిత్సలు ఉచితంగా అందించనున్నారు.

Telangana: పట్టాలపై ఆస్పత్రి.. బోగీలే ఆపరేషన్ థియేటర్లు.. వైద్యం ఉచితం !
Lifeline Express Hospital Train
Naresh Gollana
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 7:19 PM

Share

ఆస్పత్రికి వెళ్లాలంటేనే ఆర్థిక భారం.. ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే పేద, మద్యతరగతి కుటుంబాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. ఆపరేషన్ అవసరమైతే దూర ప్రాంతాలకు వెళ్లి రోజుల తరబడి ఉండాల్సిన ఇబ్బందులు.. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేదలకు ఇవన్నీ నిత్య సమస్యలే. అలాంటి వారికి వైద్యాన్ని చేరువ చేసేందుకు ఓ ఆస్పత్రి రైలే కదిలివచ్చింది. రైల్వే స్టేషన్ ఆవరణలో వైద్య పరీక్షలు.. రైలు బోగీల్లోనే అత్యాధునిక శస్త్రచికిత్సలు.. అదీ ఉచితంగా అందించేందుకు. ప్రపంచంలోనే తొలి ఆస్పత్రి రైలుగా గుర్తింపు పొందిన లైఫ్లైన్ ఎక్స్‌ప్రెస్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చేరుకుంది. పేదలు, గిరిజనులు ఖరీదైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్య సేవలు అందించేందుకు సిద్ధమైంది.

1991లో ప్రారంభం.. 256 ప్రాజెక్టులు పూర్తి

మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ 1991లో లైఫ్లైన్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించింది. సాధారణ రైలు బోగీలను ఆస్పత్రులుగా మార్చి, అవసరమైన వైద్య పరికరాలు, శస్త్రచికిత్స సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో 256 వైద్య ప్రాజెక్టులను పూర్తి చేసింది. బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అసోం తదితర రాష్ట్రాల్లో వేలాది మందికి ఈ రైలు ద్వారా వైద్య సేవలు అందాయి. ఇప్పుడు 257వ ప్రాజెక్టుగా కాగజ్‌నగర్‌లో సేవలు అందించేందుకు సిద్ధమైంది. గతంలోనూ ఈ రైలు కాగజ్‌నగర్‌లో వైద్య సేవలు అందించింది. తెలంగాణలో ఈ ప్రత్యేక వైద్య రైలు సేవలు అందుబాటులోకి రావడం జిల్లాకు ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఏయే సమస్యలకు చికిత్స చేస్తారంటే..

కంటి శుక్లాల సమస్యతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్సలు, పుట్టుకతో వచ్చే పెదవి చీలిక సమస్యలకు చికిత్సలు, చెవి సంబంధిత సమస్యలు, దంత సమస్యలు, ఎముకలకు సంబంధించిన ఇబ్బందులకు వైద్య సేవలు అందించనున్నారు. మూగ, చెవుడు సమస్యలతో బాధపడేవారికి అందుబాటులో ఉన్న సేవల పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కాలిన గాయాల కారణంగా ఏర్పడిన సమస్యలకు అవసరమైన ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేపట్టనున్నారు. తొలుత రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కేంద్రంలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వారికి ప్రత్యేకంగా తేదీ కేటాయించి, రైలులోనే ఆపరేషన్లు నిర్వహిస్తారు.

కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా సదుపాయాలు

లైఫ్లైన్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు వైద్య బోగీల్లో కలిపి ఐదు అత్యాధునిక శస్త్రచికిత్స టేబుళ్లు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్లు, దంత వైద్య సేవలకు ప్రత్యేక కోచ్, ఎక్స్‌రే యంత్రం, వైద్య పరీక్షల కోసం ల్యాబ్, రికవరీ గది, ఫార్మసీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. రైలులో 20 మంది శాశ్వత వైద్య, నర్సింగ్ తదితర సిబ్బంది సేవలందిస్తారు. అవసరమైన శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల నుంచి ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు కూడా అందుబాటులో ఉంటారు. దీంతో ఖరీదైన ఆస్పత్రుల్లో మాత్రమే లభిస్తాయని భావించే కొన్ని వైద్య సేవలు పేదలకు వారి ప్రాంతంలోనే అందే అవకాశం కలుగుతోంది.

ఈ నెల 16 నుంచి నవంబర్ 5 వరకు సేవలు

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు లైఫ్లైన్ ఎక్స్‌ప్రెస్ వైద్య సేవలు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. వైద్య పరీక్షలకు వచ్చే వారు తమ వెంట ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి. పరీక్షల అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్స తేదీని కేటాయిస్తారు. మరిన్ని వివరాల కోసం 7089878798 నంబరును సంప్రదించవచ్చు.

పేదలకు వైద్యం.. గిరిజనులకు భరోసా

వైద్యం అందక ఇబ్బందులు పడే మారుమూల ప్రాంతాల ప్రజలకు లైఫ్లైన్ ఎక్స్‌ప్రెస్ ఓ ఆశాకిరణంగా నిలుస్తోంది. ప్రయాణ ఖర్చులు, ఆస్పత్రి ఖర్చులు భరించలేక చికిత్సలను వాయిదా వేసుకునే వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఆధునిక వైద్య సదుపాయాలున్న ఆస్పత్రిని ప్రజల వద్దకే తీసుకొచ్చి, అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందించడమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. కాగజ్‌నగర్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుంటే.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, ఖరీదైన వైద్యం కోసం చేసే వ్యయప్రయాసలను కూడా తగ్గించుకోవచ్చు.

Follow Us