AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తగూడెంలో దారుణం.. భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్

ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలానికే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య భవానిని హత్య చేసిన ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్.. మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి గోదావరి నదిలో పడేశాడు. ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కొత్తగూడెంలో దారుణం.. భార్యను హత్య చేసి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్
Bhavani Narender
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 07, 2026 | 3:49 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి, మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి గోదావరి నదిలో పడేశాడు ఓ ఏఆర్ కానిస్టేబుల్. కొత్తగూడెంలో చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహిత భవాని (29) హత్య కేసును పోలీసులు ఛేదించి, నిందితుడైన ఏఆర్ కానిస్టేబుల్ నరేందర్ (30)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భవాని, కొత్తగూడెంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేందర్‌కు మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ కొంతకాలం ప్రేమలో ఉన్నారు. అనంతరం 2025 ఏప్రిల్‌లో భద్రాచలం ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ వివాహం నరేందర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. చేతులతో గొంతు నులిమి, అనంతరం చున్నీతో బిగించి భవానిని హత్య చేశాడు.

మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి..

హత్య చేసిన అనంతరం ఆధారాలు లేకుండా చేయాలని నరేందర్ ప్రయత్నించాడు. భవాని మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి బైక్‌పై తన స్వగ్రామమైన టేకులపల్లి మండలం గోలియా తండాకు తీసుకెళ్లాడు. అక్కడ తన తండ్రి సాయంతో పత్తి చేనులో ఒక రోజు పాటు మృతదేహాన్ని దాచిపెట్టాడు. అనంతరం ఆధారాలు పూర్తిగా మాయం చేయాలని తండ్రితో కలిసి పథకం వేశాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి మృతదేహాన్ని మరోసారి గోనె సంచిలో ఉంచి బైక్‌పై భద్రాచలానికి తీసుకెళ్లారు. అక్కడ గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలో పడేశారు.

మిస్సింగ్ కేసుతో వెలుగులోకి హత్య..

మూడు రోజులుగా భవాని కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె అక్క కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు నరేందర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి, తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో గాలింపు చేపట్టారు. చివరకు భవాని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ కేసులో నరేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన కుమార్తెను దారుణంగా హత్య చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవాని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us