Ganesh Nimajjanam: జై జై గణేశా.. బై బై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపయ్య..

|

Sep 09, 2022 | 8:06 PM

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తజనం.. జయ, జయ ధ్వానాల మధ్య.. బొజ్జ గణపయ్య యాత్ర ముగిసింది. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలికారు.

Ganesh Nimajjanam: జై జై గణేశా.. బై బై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపయ్య..
Ganesh
Follow us on

సాగరతీరం జనసంద్రమైంది. భక్తి నీరాజనాలు కెరటాల్లా ఎగిసిపడ్డాయి. ఇసుకేస్తే రాలనంత జనప్రభంజనం మధ్య తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్​ మహాగణనాథుడి నిమజ్జనం అట్టహాసంగా ముగిసింది. భక్తజనుల కోలాహలం, గణపతి బప్పా మోరియా అంటూ సాగిన నినాదాల మధ్య మహా గణపతి గంగమ్మ ఒడిలోకి చేరాడు. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ మహా గణేశుడికి బైబై చెప్పారు. ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి రూపంలో దర్శనమిచ్చాడు. కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్​ ప్యారిస్​ కాకుండా శిల్పి రాజేందర్ రూపొందించిన 50 అడుగుల మట్టి విగ్రహాన్ని ఈ ఏడాది పూజలు నిర్వహించారు. ఏటా 40 టన్నుల బరువులోపే ఉండే మహా గణపతి.. ఈ మట్టి కావడంతో ఈసారి 70 టన్నులకు చేరింది.

మహా గణేషుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు గురువారం అర్ధరాత్రి నుంచే ఏర్పాట్లు చేశారు. 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న 26 టైర్ల ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఖైరతాబాద్​ నుంచి ఎన్టీఆర్​ మార్గ్​ వరకు.. దారిపొడువునా భక్తుల కోలాహలం మధ్య మహా గణపతి శోభాయాత్ర సాగింది. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.

మహా సంద్రాన్ని తలపించే భక్త జనం.. పార్వతీ తనయుడిని గంగమ్మ ఒడికి చేరే వరకూ ఉన్నారు. దారి పొడవునా భక్తులు లంబోదరుడికి జేజేలు పలికారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చేశారు. వెళ్లిరా గణపయ్య.. మళ్లీ రావయ్యా అంటూ గణేశుడిని భక్తులు సాగనంపారు. ఖైరతాబాద్ మహా గణపయ్య ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..