‘స్పేస్ ఆన్ వీల్స్’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల ముందుకు ఇస్రో రాకెట్లు, చంద్రయాన్ నమూనాలు
ISRO's 'Space on Wheels' Bus: ఇస్రో ‘స్పేస్ ఆన్ వీల్స్’ కార్యక్రమంతో గ్రామీణ విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానాన్ని నేరుగా పాఠశాలలకు తీసుకెళ్తోంది. ఈ మొబైల్ బస్సులో రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలతో పాటు 3D విజువల్స్ ప్రదర్శిస్తారు. చంద్రయాన్, గగన్‌యాన్ వంటి మిషన్ల వివరాలను వివరిస్తూ, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచి, భావి శాస్త్రవేత్తలను ప్రోత్సహించడమే ఇస్రో లక్ష్యం.

ISRO Space on Wheels: ఆకాశంలో దూసుకెళ్లే రాకెట్లను టీవీల్లోనో, పేపర్లలోనో చూసి మురిసి పోతుంటాం. వీటిని చూసే విద్యార్థుల్లో అంతరిక్ష రహస్యాలను శోధించాలనే ఆసక్తి పెరుగుతుంది. నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లను, చందమామపై అడుగుపెట్టే ల్యాండర్లను నేరుగా చూడాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. ఇందుకు రాకెట్ ప్రయోగ కేంద్రాలకు వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి కోట్లాది మంది గ్రామీణ విద్యార్థులకు ఇస్రో సరికొత్త సర్ ప్రైజ్ ఇస్తోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఎన్నో మైలురాళ్లను దాటింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం తోపాటు సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య-ఎల్1ను పంపిన ఘనత మన ఇస్రోది. ఇస్రో అంతిమ లక్ష్యం కేవలం రాకెట్లను ప్రయోగించడం మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల్లో సైన్స్ పట్ల, సాంకేతికత పట్ల ఆసక్తిని పెంచడం. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, శాస్త్రవేత్త కావాలనే బలమైన కలను సాకారం చేయాలని భావిస్తోంది.
అంతరిక్ష ప్రయోగాల నమూనాలను విద్యార్థుల ముంగిటకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎన్ఆర్ఎస్సీ కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్‌లో ఎన్ఆర్ఎస్సీ ఔట్రీచ్ ఫెసిలిటీ కేంద్రం ఉంది. ఇస్రో పరిశోధనల నమూనాలతో ఇక్కడ ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఉంటాయి. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ముందుగా ఈ-మెయిల్ ద్వారా స్లాట్స్ బుక్ చేసుకుంటే ప్రతీరోజు 180-200 విద్యార్థులు (8,9,10 తరగతులు) కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఔట్రీచ్ కేంద్రానికి వెళ్లలేని గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం స్పేస్ ఆన్ వీల్స్ బస్సును నేరుగా పాఠశాలలకే తీసుకువెళ్లి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
‘స్పేస్ ఆన్ వీల్స్’ ..
భావి భారత శాస్త్రవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా ఇస్రో సరికొత్త అడుగులు వేస్తోంది. పుస్తకాల్లో చదువుకునే అంతరిక్ష విజ్ఞానాన్ని విద్యార్థుల కళ్లముందుకు తెచ్చేందుకు ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరిట ప్రత్యేక బస్సును రూపొందించింది. ఈ అంతరిక్ష బస్సు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని పాఠశాలల వైపు దూసుకెళ్తోంది. రాకెట్ ప్రయోగ కేంద్రానికి వెళ్లలేని ఆ చిన్నారుల కోసం.. ఏకంగా రాకెట్‌నే వాళ్ల ముంగిట్లోకి మోసుకొస్తోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. చంద్రయాన్-3 విజయం నుంచి.. రాబోయే గగన్‌యాన్ మిషన్ వరకు.. సమస్త అంతరిక్ష విజ్ఞానాన్ని ఒకే ఒక్క బస్సులో బంధించి, నేరుగా పాఠశాలల గేట్ల ముందుకు తెస్తోంది. అదే.. ‘స్పేస్ ఆన్ వీల్స్’.
ఒకే బస్సులో అంతరిక్ష ప్రపంచం..
ఒక సాధారణ బస్సును అత్యాధునిక అంతరిక్ష మ్యూజియంగా మార్చేసింది ఇస్రో. బస్సు లోపలికి అడుగుపెట్టగానే విద్యార్థులు సరికొత్త లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అచ్చం ఇస్రో పరిశోధనా కేంద్రంలో ఉన్నట్లే అనిపిస్తుంది. భారత్ గర్వపడేలా ప్రయోగించిన దేశ కీర్తికిరీటాలైన PSLV, GSLV రాకెట్ల లైవ్ నమూనాలు, చంద్రయాన్, మంగళ్యాన్ మిషన్లలో ఉపయోగించిన ఉపగ్రహాల (Satellites) మోడల్స్, భవిష్యత్తులో మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్‌యాన్ ప్రాజెక్టులకు సంబంధించిన అద్భుతమైన నమూనాలను (Models) ఇందులో ప్రదర్శిస్తున్నారు. వివిధ రకాల రాకెట్లు, కమ్యూనికేషన్ ఉపగ్రహాల బొమ్మలను చూడటమే కాదు.. రాకెట్ ఎలా పనిచేస్తుంది? అంతరిక్షంలోకి ఉపగ్రహాలు ఎలా వెళ్తాయి? జీశాట్, ఇన్శాట్ వంటి శాటిలైట్లు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇస్రో ప్రతినిధులు డిజిటల్ స్క్రీన్ల ద్వారా విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు.
3డీ నమూనాలతో ప్రత్యక్ష అవగాహన..
కేవలం నమూనాలే కాదు.. భూమి, చంద్రుడికి సంబంధించిన 3D నమూనాలు, విజువల్స్ ఈ బస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భూమి చుట్టూ ఉపగ్రహాలు ఎలా తిరుగుతాయి? చంద్రుడి ఉపరితలం ఎలా ఉంటుంది? రాకెట్ ప్రయోగం జరిగినప్పుడు ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయి? అనే విషయాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి అవగాహన పెంచుకుంటున్నారు.
గ్రామీణ విద్యార్థుల ముంగిట్లోకి విజ్ఞానం..
పెద్ద పెద్ద నగరాల్లోని విద్యార్థులకు సైన్స్ మ్యూజియంలు, ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. కానీ, మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థులకు ఈ సౌకర్యం ఉండదు. అందుకే ఇస్రో నేరుగా ప్రభుత్వ, గ్రామీణ పాఠశాలలకే ఈ స్పేస్ బస్సును పంపుతోంది. ఉపాధ్యాయులు సైతం ఇస్రో తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పుస్తకాల్లోని బొమ్మలను చూసి చదువుకోవడం కంటే, ఇలా కళ్లముందు నమూనాలను చూడటం వల్ల పిల్లల్లో సైన్స్‌పై ఆసక్తి వందరెట్లు పెరుగుతుంది.
కళ్లముందు అంతరిక్షం.. మనసులో కల..
ఈ స్పేస్ బస్సును చూస్తున్న చిన్నారుల కళ్లల్లో ఆనందం, ఆశ్చర్యం కనిపిస్తోంది. నిన్నటి వరకు టీవీల్లో, పేపర్లలో మాత్రమే చూసిన రాకెట్లను తాకడం.. వాటి పనితీరును తెలుసుకోవడంతో విద్యార్థులు మరువలేని అనుభూతిని పొందుతున్నారు. తాము కూడా పెద్దయ్యాక ఇస్రోలో చేరి దేశం గర్వపడేలా శాస్త్రవేత్తలు అవుతామని విద్యార్థులు చెబుతున్నారు. గగన్‌యాన్ ద్వారా భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతున్న వేళ.. ఇలాంటి ప్రచార కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో ఉత్తేజపరుస్తున్నాయి. చిన్నారుల కళ్లముందు అంతరిక్ష అద్భుతాలను సాక్షాత్కరింపజేస్తూ.. భావి భారత శాస్త్రవేత్తల నిర్మాణానికి పునాది వేస్తున్న ఇస్రో ప్రయత్నం నిజంగా అభినందనీయం.
