హైదరాబాద్ వేదికగా గ్లోబల్ బిజినెస్ హంగామా.. డిసెంబర్ 7 నుంచి మెగా సమ్మిట్.. సీఎం రేవంత్ భారీ ప్లాన్!

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులు వివరించారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు.

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ బిజినెస్ హంగామా.. డిసెంబర్ 7 నుంచి మెగా సమ్మిట్.. సీఎం రేవంత్ భారీ ప్లాన్!
Cm Revanth Reddy Reviews Mega Investment Summit

Edited By:

Updated on: Nov 05, 2026 | 8:09 PM

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులు వివరించారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులకు, అధికారులకు పలు సూచనలు చేశారు.

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతి ప్రతినిధికి ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతినిధులు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే రిజిస్ట్రేషన్, పాస్‌ల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగానే ప్రతినిధులకు అందజేయాలన్నారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు, అన్ని రంగాల ప్రతినిధులకు వేదికలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

సమ్మిట్‌లో ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారితోపాటు భద్రతా అధికారిని నియమించాలని సీఎం సూచించారు. గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు. పెట్టుబడి ఒప్పందాలు చేసుకునేందుకు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించాలన్నారు. నవంబర్ 15 నాటికి సమ్మిట్ ఏర్పాట్ల పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గత ఏడాది తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌తో పోలిస్తే ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఒక ఎక్స్‌పో హాల్ ఉండగా ఈసారి ఆరు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ కార్యక్రమాలను రూపొందించారు. సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ల ఏర్పాట్లను అధికారులు వివరించారు.

రక్షా ఎక్స్‌పోలో రక్షణ, ఏరోస్పేస్, అంతరిక్షం, సైబర్ సెక్యూరిటీ రంగాలకు చెందిన ఆధునిక పరికరాలు, డ్రోన్లు, రోబోటిక్స్ ప్రదర్శించనున్నారు. వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు 575 సంస్థలను ఆహ్వానించగా, ఇప్పటివరకు 49 సంస్థలు ముందుకు వచ్చాయి. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్–2026 నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసి 136 స్టార్టప్‌ల ఆవిష్కరణలను ప్రదర్శించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌లో భాగంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రజా మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు నవంబర్ 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి 60 కంపెనీల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల పెవిలియన్‌లో ఆధునిక సాగు పద్ధతులు, వ్యవసాయ డ్రోన్లు, పాడి, మత్స్య, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, చేనేత, బతుకమ్మ, కాకతీయుల శిల్పకళతోపాటు రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ప్రత్యేక తెలంగాణ పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో పర్యాటక రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రదర్శించాలన్నారు.

విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ఎడ్యుకేషన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. ‘నర్సరీ నుంచి ఆక్స్‌ఫర్డ్ వరకు’ తెలంగాణ విద్యారంగం ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్‌లో చర్చలు జరగాలని సీఎం సూచించారు. మూడు రోజుల సమ్మిట్‌లో నాలుగు ప్రధాన హాళ్లలో 52 రంగాలవారీ సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

సమ్మిట్ నిర్వహణ కోసం 25 రంగాలవారీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 3,500 ఆహ్వానాలను పంపించారు. అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, వసతి, ప్రొటోకాల్, భద్రత, ప్రదర్శనల నిర్వహణ కోసం పది అధికారుల కమిటీలను ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం సూచించారు.

ఎల్‌నినో సవాళ్లపై తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు డిసెంబర్ 8న ప్రత్యేకంగా తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 200 మంది శాస్త్రవేత్తలు, రైతులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొననున్నారు. కరువును తట్టుకునే వ్యవసాయం, పశుసంరక్షణ, తాగునీటి భద్రత, అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణ, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాలను సంపదగా మార్చడం వంటి ఐదు ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. వాతావరణ మార్పులపై గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేకంగా చర్చ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే వాతావరణ మార్పుల కారణంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తక్షణ చర్యలతోపాటు దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించే దిశగా ఈ సదస్సు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం తోపాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్, గ్లోబల్ సమ్మిట్ అధికారుల కమిటీల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us