AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మరో మహానగరం.. ఫ్యూచర్ సిటీలో ఏయే జోన్లు వస్తున్నాయో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు సమాచారం.. 7 మండలాల్లోని 71 గ్రామాల పరిధిలో 1.80 లక్షల ఎకరాల్లో నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఈవీ, డేటా సెంటర్లు, హెల్త్ సిటీకి ప్రత్యేక జోన్లు ప్రతిపాదించారు. త్వరలో గ్లోబల్ సమ్మిట్‌లో మాస్టర్ ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Hyderabad: మరో మహానగరం.. ఫ్యూచర్ సిటీలో ఏయే జోన్లు వస్తున్నాయో తెలుసా?
Telangana Future City Master Plan
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 9:16 AM

Share

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక అడుగు పడింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక నగరాన్ని నిర్మించే లక్ష్యంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు సమాచారం. సింగపూర్‌కు చెందిన డీపీ ఆర్కిటెక్ట్స్ సంస్థ ఈ ప్రణాళికను రూపొందించింది. త్వరలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో మాస్టర్ ప్లాన్‌ను అధికారికంగా ఆవిష్కరించే అవకాశముంది.

71 గ్రామాలు.. 1.80 లక్షల ఎకరాల పరిధిలో అభివృద్ధి

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మొత్తం 7 మండలాల్లోని 71 రెవెన్యూ గ్రామాలను చేర్చారు. సుమారు 867 చదరపు కిలోమీటర్ల పరిధిలో, దాదాపు 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో పెరిగే జనాభా, పారిశ్రామిక అవసరాలు, రవాణా సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది.

నగరం ఇష్టానుసారంగా విస్తరించకుండా, ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేయడమే మాస్టర్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వ్యవసాయ భూములు, నివాస ప్రాంతాలు, పారిశ్రామిక జోన్లు, వాణిజ్య ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించనున్నారు.

లైఫ్ సైన్సెస్, ఏఐ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం

ఫ్యూచర్ సిటీలో వివిధ రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లను ప్రతిపాదించారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య రంగాలు, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లకు ప్రాధాన్యం కల్పించారు.

ప్రతిపాదిత భూకేటాయింపుల ప్రకారం లైఫ్ సైన్సెస్ హబ్‌కు అత్యధికంగా 4,000 ఎకరాలు కేటాయించనున్నారు. నివాస ప్రాంతాల కోసం 2,477 ఎకరాలను ప్రతిపాదించారు. ఈవీ, ఎనర్జీ పార్కులకు 1,976 ఎకరాలు, హెల్త్ సిటీకి 594 ఎకరాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించారు.

ఏఐ సిటీ కోసం 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్‌కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ హబ్‌కు 255 ఎకరాలను ప్రతిపాదించారు.

రవాణా అనుసంధానానికి ప్రత్యేక ప్రణాళిక

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రవాణా వ్యవస్థ కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రేడియల్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులను అనుసంధానించేలా రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. అంతర్గత రవాణాతో పాటు పరిశ్రమలకు అవసరమైన లాజిస్టిక్స్ వ్యవస్థను కూడా సమన్వయం చేయనున్నారు.

దీంతో నగరంలోని వివిధ జోన్ల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట

పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటం మాస్టర్ ప్లాన్‌లో మరో కీలక అంశం. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో చెరువులు, నాలాలు, అటవీ ప్రాంతాలు, సహజ జలవనరుల పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించారు.

పచ్చదనం, నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే పారిశ్రామిక విస్తరణ చేపట్టేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. పరిసర గ్రామాలపై అభివృద్ధి ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఇందులో భాగంగా ఉంది.

భూముల జోనింగ్‌పై రైతుల్లో ఆసక్తి

మాస్టర్ ప్లాన్ సిద్ధమైన నేపథ్యంలో తమ భూములు ఏ జోన్ పరిధిలోకి వస్తాయనే అంశంపై రైతులు, భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ ప్రాంతంలో పారిశ్రామిక జోన్లు, నివాస ప్రాంతాలు, ఇతర అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయనే దానిపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

ముఖ్యంగా భూముల వినియోగ మార్పులు, భూసేకరణ, పరిహారం, రైతుల హక్కులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ ప్లాన్ అధికారికంగా విడుదలైతే ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు అభివృద్ధితో పాటు భూముల వినియోగంపై కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us